అటు సౌరాష్ట్ర... ఇటు విదర్భ | Vidarbha continue winning run, beat Jharkhand in Vijay Hazare trophy | Sakshi
Sakshi News home page

అటు సౌరాష్ట్ర... ఇటు విదర్భ

Feb 6 2018 10:37 AM | Updated on Feb 6 2018 10:37 AM

Vidarbha continue winning run, beat Jharkhand in Vijay Hazare  trophy - Sakshi

వికెట్‌ తీసిన ఆనందంలో విదర్భ ఆటగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ చాంపియన్‌ విదర్భ విజయ్‌ హజారే వన్డే టోర్నీలో కూడా శుభారంభం చేసింది. సోమవారం ఏఓసీ గ్రౌండ్స్‌లో హోరాహోరీగా జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో విదర్భ 7 పరుగుల స్వల్ప తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. విదర్భ 50 ఓవర్లలో సరిగ్గా 300 పరుగులకు ఆలౌట్‌ కాగా... జార్ఖండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులే చేయగలిగింది. జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 32 పరుగులతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేయగా, ఛత్తీస్‌గఢ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేయగలిగింది.
 
రాణించిన జితేశ్, సంజయ్‌...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విదర్భ ఆరంభంలోనే కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (9) వికెట్‌ కోల్పోయింది. అయితే జితేశ్‌ శర్మ (83 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్‌), తొలి మ్యాచ్‌ ఆడుతున్న సంజయ్‌ రామస్వామి (86 బంతుల్లో 77; 9 ఫోర్లు) కలసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. చివర్లో అపూర్వ్‌ వాంఖడే (34 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. జార్ఖండ్‌ బౌలర్లలో రాహుల్‌ శుక్లా 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...అతుల్‌ సుర్వర్, షాబాజ్‌ నదీమ్, వికాస్‌ సింగ్‌ తలా 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే జార్ఖండ్‌ ఓపెనర్‌ సిద్దిఖీ (0) అవుట్‌ కాగా, విరాట్‌ సింగ్‌ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.

ఈ దశలో సీనియర్‌ ఆటగాడు సౌరభ్‌ తివారి (77 బంతుల్లో 65; 7 ఫోర్లు) రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించిన తివారి... కుమార్‌ దేవబ్రత్‌ (76 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జత చేశాడు. అయితే తివారిని కరణ్‌ శర్మ అవుట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో వికాశ్‌ సింగ్‌ (37 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు.

షెల్డన్‌ జాక్సన్‌ సెంచరీ...

భారత టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా, ఓపెనర్‌ షెల్డన్‌ జాక్సన్‌ భారీ భాగస్వామ్యం సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. రాబిన్‌ ఉతప్ప (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగిన తర్వాత జాక్సన్‌ (107 బంతుల్లో 106 రిటైర్డ్‌హర్ట్‌; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), పుజారా (92 బంతుల్లో 60; 4 ఫోర్లు) కలసి రెండో వికెట్‌కు 170 పరుగులు జత చేశారు. ఆ తర్వాతి ఆటగాళ్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 23) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. పంకజ్‌ రావు, షానవాజ్‌ హుస్సేన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛత్తీస్‌గఢ్‌ ఆటగాళ్లు కొంత పోరాటం కనబర్చినా లక్ష్యానికి జట్టు చాలా దూరంలో ఆగిపోయింది. మనోజ్‌ సింగ్‌ (74 బంతుల్లో 58; 6 ఫోర్లు), విశాల్‌ కుష్వా (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేయగా, సహ్‌బన్‌ ఖాన్‌ (40) ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ధర్మేంద్ర జడేజా (4/41) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement