హనుమ విహారి శతకం | Vidarbha Bowl Out Rest of India for 330 Despite Vihari Ton | Sakshi
Sakshi News home page

హనుమ విహారి శతకం

Feb 13 2019 3:35 AM | Updated on Feb 13 2019 3:35 AM

 Vidarbha Bowl Out Rest of India for 330 Despite Vihari Ton - Sakshi

నాగపూర్‌: రంజీ ట్రోఫీ చాంపియన్‌ విదర్భ ఇరానీ కప్‌లో మొదటి రోజు ప్రత్యర్థి రెస్టాఫ్‌ ఇండియాను కట్టడి చేసింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో విదర్భ బౌలర్లు రాణించడంతో రెస్టాఫ్‌ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి (211 బంతుల్లో 114; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మయాంక్‌ అగర్వాల్‌ (134 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించినా... ఇతర బ్యాట్స్‌మన్‌ వైఫల్యంతో రెస్టాఫ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. విదర్భ స్పిన్నర్లు అక్షయ్‌ వాఖరే, ఆదిత్య సర్వతే చెరో 3 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగనున్న విదర్భ భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే గాయంతో వసీం జాఫర్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుకు సమస్యగా మారగా... మొదటి రోజు నుంచే జామ్తా మైదానంలో బంతి బాగా స్పిన్‌ తిరుగుతోంది. రెస్టాఫ్‌ జట్టులో ధర్మేంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.  

భారీ భాగస్వామ్యం... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రెస్టాఫ్‌ ఇండియా ఆరంభంలోనే అన్‌మోల్‌ ప్రీత్‌ (15) వికెట్‌ కోల్పోయింది. అయితే మయాంక్, విహారి కలిసి ధాటిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా తొలి ఓవర్లో రెండు ఫోర్లతో దూకుడుగా ఆట మొదలు పెట్టిన మయాంక్‌ ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శిస్తూ 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు ‘సున్నా’ వద్ద విహారికి అదృష్టం కలిసొచ్చింది. యష్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో విహారి కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా విదర్భ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్‌ చేశారు. అంపైర్‌ దీనిపై స్పందించలేదు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలింది. లంచ్‌ సమయానికి జట్టు స్కోరు 142 పరుగులకు చేరింది. రెండో సెషన్‌లో విహారి చెలరేగిపోయాడు. సర్వతే ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన అతను 75 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సెంచరీ దిశగా దూసుకుపోతున్న మయాంక్‌... మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో గుర్బానీకి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రెస్టాఫ్‌ బ్యాటింగ్‌ తడబడింది. ఒకరి వెంట మరొకరు వేగంగా పెవిలియన్‌ చేరారు. భారత వన్డే జట్టులో చోటు ఆశిస్తున్న రహానే (13) మళ్లీ విఫలం కాగా... శ్రేయస్‌ అయ్యర్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (2), కృష్ణప్ప గౌతమ్‌ (7) నిలవలేకపోయారు. చివరకు రాహుల్‌ చహర్‌ (22) విహారికి అండగా నిలిచాడు. సర్వతే బౌలింగ్‌లో కొట్టిన ఫోర్‌తో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో విహారి 16వ సెంచరీ పూర్తయింది. వీరిద్దరు స్కోరును 300 పరుగులు దాటించగా, అంకిత్‌ రాజ్‌పుత్‌ (25) ఆఖర్లో కొన్ని పరుగులు జోడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement