భళా.. బొటాస్‌  

Valtteri Bottas wins Australian Grand Prix for Mercedes - Sakshi

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

 హామిల్టన్కు రెండో స్థానం  

మెల్‌బోర్న్‌: ఫార్ములావన్   2019 సీజన్  తొలి రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో బొటాస్‌ 58 ల్యాప్‌లను గంటా 25 నిమిషాల 27.325 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ చాంపియన్ , మెర్సిడెస్‌ జట్టుకే చెందిన లూయిస్‌ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతను గంటా 25 నిమిషాల 48.211 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. గతేడాది పలు రేసుల్లో బొటాస్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లినా హామిల్టన్ వరల్డ్‌ టైటిల్‌ అవకాశాలకు దెబ్బ పడకూడదనే ఉద్దేశంతో రేసు జరుగుతున్న సమయంలోనే మెర్సిడెస్‌ యాజమాన్యం వేగం తగ్గించాలని, హామిల్టన్కు సహకరించాలని బొటాస్‌కు సూచనలు ఇచ్చింది. ఈ అంశంపై బొటాస్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ లోని తొలి రేసులో మాత్రం అలా జరగలేదు. పోల్‌ పొజిషన్తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ను తొలి ల్యాప్‌ మలుపులోనే రెండో స్థానంలో ఉన్న బొటాస్‌ ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు.

ఆ తర్వాత బొటాస్‌ వెనుదిరిగి చూడలేదు. 2017లో అబుదాబిలో టైటిల్‌ గెలిచిన తర్వాత బొటాస్‌కు మళ్లీ టైటిల్‌ దక్కడం ఇదే తొలిసారి. గత సంవత్సరం బొటాస్‌కు ఏదీ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో రాణించినా, ప్రధాన రేసులో విఫలమవ్వడం... కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడం... ఇతరత్రా కారణాలతో అతను ఒక్క రేసులో కూడా గెలవలేకపోయాడు. కానీ ఈ సీజన్లో తొలి రేసులోనే అతను విజేతగా నిలిచి మరిన్ని టైటిల్స్‌పై దృష్టి పెట్టాడు. ఓవరాల్‌గా 119 రేసుల్లో పాల్గొన్న బొటాస్‌ కిది నాలుగో టైటిల్‌. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్‌–10): 1. బొటాస్‌ (మెర్సిడెస్‌), 2. హామిల్టన్ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్‌), 4. వెటెల్‌ (ఫెరారీ), 5. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 6. మాగ్నుసెన్ (హాస్‌), 7. హుల్కెన్ బర్గ్‌ (రెనౌ), 8. రైకోనెన్ (అల్ఫా రోమియో రేసింగ్‌), 9. స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 10. క్వియాట్‌ (ఎస్టీఆర్‌). 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top