‘రాయల్’గా నిలిచేదెవరో! | Today the IPL Eliminator | Sakshi
Sakshi News home page

‘రాయల్’గా నిలిచేదెవరో!

May 20 2015 1:05 AM | Updated on Sep 3 2017 2:19 AM

‘రాయల్’గా నిలిచేదెవరో!

‘రాయల్’గా నిలిచేదెవరో!

ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగిన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ సాగేకొద్దీ క్రమంగా తడబడి చివరి మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌కు చేరింది.

నేడు ఐపీఎల్ ఎలిమినేటర్
రాజస్తాన్‌తో బెంగళూరు ఢీ

 
 క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లి ఒకవైపు... రహానే, వాట్సన్, స్మిత్ మరోవైపు... ఐపీఎల్‌లో రెండు పటిష్టమైన టాప్ ఆర్డర్‌ల మధ్య నేడు పోరాటం జరగనుంది. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి రెండు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయి. మరి ‘రాయల్’గా మిగిలేదెవరో చూడాలి.
 
 పుణే : ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగిన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ సాగేకొద్దీ క్రమంగా తడబడి చివరి మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌కు చేరింది. మరోవైపు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సునాయాసంగానే నాకౌట్ దశకు వచ్చింది. అయితే తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్ ఆడే స్థితిలో ఉన్న కోహ్లి సేన... వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేటర్ ఆడబోతోంది. గెలిచిన జట్టు రేసులో మిగులుతుంది. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. రెండు జట్లూ చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ మహారాష్ర్ట క్రికెట్ సంఘం మైదానంలో బుధవారం జరుగుతుంది.

 స్మిత్ సారథ్యంలోనే...
 ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటివరకూ కెప్టెన్‌గా ఎక్కడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియాకు, రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్ని మ్యాచ్‌ల్లోనూ స్మిత్ జట్టే గెలిచింది. పైకి చెప్పకపోయినా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి ఇదే కారణం కావచ్చు. వరుస ఓటములతో డీలా పడిన జట్టు కోల్‌కతాతో మ్యాచ్‌లో స్మిత్‌ను సారథిగా ఎంపిక చేసి విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు నాకౌట్ దశ కాబట్టి అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ మరోసారి స్మిత్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది.

బ్యాటింగ్‌లో వాట్సన్ ఫామ్‌లోకి రావడం, రహానే టోర్నీ అంతటా నిలకడగా ఆడటం రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. ఫాల్క్‌నర్ మెరుపులు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. శామ్సన్, దీపక్ హుడా, స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ నాయర్ లాంటి బ్యాట్స్‌మెన్ ఎవరూ ఇప్పటివరకూ తమ సత్తా బయటపెట్టలేదు. ఈ మ్యాచ్‌లో వీళ్లు కుదురుకుంటే రాయల్స్‌కు సమస్య ఉండదు. బౌలింగ్‌లో మోరిస్, కులకర్ణి, ప్రవీణ్ తాంబే కీలకం. గత మ్యాచ్‌లో తాంబే ఆడలేదు. ఈ మ్యాచ్‌లో ఈ వెటరన్ లెగ్‌స్పిన్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

 ఆ ముగ్గురిలో ఇద్దరు ఆడాలి
 బ్యాటింగ్‌లో బెంగళూరు బలం అంతా టాప్ ఆర్డరే. గేల్, డివిలియర్స్, కోహ్లి ముగ్గురూ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు ఒక్క మంచి భాగస్వామ్యం నెలకొల్పినా బెంగళూరు పరుగుల వరద పారిస్తుంది. యువ క్రికెటర్ సర్ఫరాజ్, మన్‌దీప్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే దినేశ్ కార్తీక్ మాత్రం జట్టుకు భారంగానే కనిపిస్తున్నాడు.  ఇప్పటివరకూ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక బౌలింగ్‌లో స్టార్క్ పైనే ప్రధానంగా ఆశలు ఉన్నాయి. లెగ్‌స్పిన్నర్ చాహల్‌తో పాటు ఆల్‌రౌండర్ వీస్, హర్షల్ పటేల్ కూడా నిలకడగానే రాణిస్తున్నారు. శ్రీనాథ్ అరవింద్ గాయం నుంచి కోలుకుంటే అశోక్ దిండా పెవిలియన్‌కు పరిమితం కావొచ్చు.

 జట్లు (అంచనా)
 రాజస్తాన్ రాయల్స్: స్మిత్ (కెప్టెన్), రహానే, వాట్సన్, శామ్సన్, నాయర్, ఫాల్క్‌నర్, హుడా, బిన్నీ, మోరిస్, కులకర్ణి, తాంబే.
 బెంగళూరు రాయల్ చాలెంజర్స్: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, మన్‌దీప్, కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, హర్షల్, చాహల్, అరవింద్/దిండా.
  సీజన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9 వికెట్లతో రాజస్తాన్‌పై గెలిచింది. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement