
వెస్టిండీస్‌కు మర్చిపోలేనిదిగా మిగిలిన ఈ పర్యటనను భారత జట్టు 3–0తో ముగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ విండీస్ చెన్నైలో జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ఆతిథ్య జట్టుకు పోటీనిస్తుందా చూడాలి. వారి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకావడం లేదు. టీమిండియా ఆటగాళ్లు అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అదరగొడుతున్నారు. కొత్త ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వన్డే, టి20 సిరీస్‌ల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.అచ్చం సెహ్వాగ్‌ను తలపించాడు. ఒక్కసారి జోరు అందుకుంటే అతన్ని ఆపడం కష్టం. భారీ సెంచరీల కోసం ఆకలిగొన్న వాడిలా విరుచుకుపడుతున్నాడు. ఓ బంతిని బౌండరీకి తరలించాక మరో భారీ షాట్ కొట్టే ముందు సెహ్వాగ్ ఓసారి మైదానాన్ని గమనించేవాడు.
రోహిత్ మాత్రం అలవోకగా మరో షాట్‌కు యత్నిస్తాడు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కనబరిచే దూకుడు టెస్టుల్లోనూ కొనసాగించగలిగితే సంప్రదాయ క్రికెట్‌లో వివ్ రిచర్డ్స్, సెహ్వాగ్ తర్వాత ప్రపంచంలో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్, లారా, పాంటింగ్ లాంటి దిగ్గజాలు నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. కానీ రిచర్డ్స్, సెహ్వాగ్‌లాగా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడలేదు. వీరిద్దరూ తమ ఆటతీరుతో బౌలర్లను బెంబేలెత్తించారు. చివరి మ్యాచ్‌లో కుల్దీప్‌కు విశ్రాంతి కల్పించడంతో చహల్‌కు అవకాశం దక్కనుంది. అతను కూడా విండీస్ పనిపట్టడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భువనేశ్వర్‌కు మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. అరంగేట్రం ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా ఆకట్టుకున్నారు. చివరి మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా... ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన జట్లకు అంతగా కలిసి రాలేదు.