శ్రీలంక చారిత్రక విజయం

Sri Lanka Historic Win To Level Series Against West Indies - Sakshi

చివరి టెస్ట్‌ గెలిచి సిరీస్‌ సమం చేసన శ్రీలంక

ట్యాంపరింగ్‌ వివాదం తర్వాత ఉపశమన విజయం   

కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో టెస్టు గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక

ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం ఆక్రమ్‌, సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోని వంటి మహామహుల సారథ్యాలలోని జట్లు ఈ మైదానంలో విజయాన్ని సాధించలేకపోయాయి.  టెస్ట్‌ ప్రారంభానికి ముందు ట్యాంపరింగ్‌ ఉదంతం.. కెప్టెన్‌ చండిమాల్‌పై వేటు.. ఒత్తిడిలో లంక యువ జట్టు.. సురంగ లక్మల్‌కు సారథ్య బాధ్యతలు.. సిరీస్‌లో వెనుకంజ.. టెస్టులో పలుమార్లు వర్షం అంతరాయం. ఇవన్నీ శ్రీలంక విజయానికి అడ్డంకి కాలేదు. ఆసియా జట్లకు కలగా ఉండే కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో గెలిచి శ్రీలంక చరిత్ర సృష్టించింది.

బ్రిడ్జిటౌన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. పేస్‌కు స్వర్గధామమైన కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. చివరి టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, సిరీస్‌లో విశేషంగా రాణించిన విండీస్‌ కీపర్‌ షేన్‌ డౌరిచ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’  అవార్డులు లభించాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డేనైట్‌ టెస్టులో చివరకు విజయం లంకనే వరించింది.

144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంకను హోల్డర్‌ దెబ్బతీశాడు, వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో  ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఈ సమయంలో డి పెరీరా (23 నాటౌట్‌), కుశాల్‌ పెరీరా (28 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు. రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్‌ ఐదు వికెట్లు సాధించగా, కీమర్‌ రోచ్‌కు ఒక్క వికెట్‌ దక్కింది. 

చివరి టెస్టులో ఇరజట్ల స్కోర్‌ వివరాలు
వెస్టిండీస్‌ : 204 & 93
శ్రీలంక : 154 & 144/6

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top