‘మిక్స్‌డ్‌’ సెమీస్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ జంట | Shuttlers Pranaav, Sikki enter mixed doubles semi-finals at Japan Open | Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌’ సెమీస్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ జంట

Sep 23 2017 12:53 AM | Updated on Sep 23 2017 1:56 AM

Shuttlers Pranaav, Sikki enter mixed doubles semi-finals at Japan Open

ఇన్నాళ్లూ గ్రాండ్‌ప్రి గోల్డ్, గ్రాండ్‌ప్రి, ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ స్థాయి టోర్నమెంట్‌లలో మెరిపించిన సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట ఎట్టకేలకు ‘సూపర్‌ సిరీస్‌’ టోర్నీలో తమ సత్తా చాటుకుంది. టోక్యో వేదికగా ఈ భారత జంట జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది బ్రెజిల్, రష్యా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టోర్నీలలో విజేతగా నిలిచిన సిక్కి–ప్రణవ్‌ ద్వయం తొలిసారి సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఫైనల్‌ బెర్త్‌పై దృష్టి పెట్టింది.   

టోక్యో: ఒకవైపు సింగిల్స్‌ విభాగాల్లో భారత స్టార్‌ ఆటగాళ్లు నిష్క్రమించినా... మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమ కెరీర్‌లో తొలిసారి ఓ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పంజాబ్‌కు చెందిన తన డబుల్స్‌ భాగస్వామి ప్రణవ్‌ చోప్రాతో కలిసి బరిలోకి దిగిన హైదరాబాద్‌ అమ్మాయి సిక్కి రెడ్డి మరో స్ఫూర్తిదాయక విజయంతో ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిక్కి–ప్రణవ్‌ ద్వయం 21–18, 9–21, 21–19తో సెయుంగ్‌ జె సియో–కిమ్‌ హా నా (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో టకురో హోకి–సయాకా హిరోటా (జపాన్‌) జంటతో సిక్కి – ప్రణవ్‌ జోడీ తలపడుతుంది.

వరుసగా ఐదు పాయింట్లు...
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న సిక్కి–ప్రణవ్‌ జోడీ క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌ చివర్లో సిక్కి–ప్రణవ్‌ ద్వయం 16–19తో వెనుకబడింది. ఈ దశలో భారత జోడీ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.  

శ్రీకాంత్‌ జోరుకు బ్రేక్‌...
వరుసగా మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌పై గురి పెట్టిన భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ జోరుకు ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ అడ్డుకట్ట వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 17–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కోల్పోవడం గమనార్హం. మరో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 15–21, 14–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement