
దుబాయ్: వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ 90 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై... ఒమన్ 12 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. మున్సే (43 బంతుల్లో 65; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), బెరింగ్టన్ (18 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు.
అనంతరం యూఏఈ 18.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. రమీజ్ షహజాద్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)దే అత్యధిక స్కోరు. వాట్, షరీఫ్ చెరో 3 వికెట్లు తీశారు. స్కాట్లాండ్ గతంలో 2007, 2009, 2016 టి20 ప్రపంచకప్‌లలో ఆడింది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో తొలుత ఒమన్ జట్టు 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది.