సెమీస్‌లో సైనా, ప్రణయ్‌

Saina Nehwal, HS Prannoy Enter Semis; PV Sindhu, Kidambi Srikanth Ousted - Sakshi

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌ ఓటమి

వుహాన్‌ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు టాప్‌ సీడ్‌ కిడాంబి శ్రీకాంత్, మూడో సీడ్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైనా 21–15, 21–13తో లీ జాంగ్‌ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19–21, 10–21తో సుంగ్‌ జీ హున్‌ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా సెమీస్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 18–21, 23–21, 21–12తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 2007లో అనూప్‌ శ్రీధర్‌ తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా ప్రణయ్‌ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 12–21, 15–21తో లీ చోంగ్‌ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సైనా; ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)తో ప్రణయ్‌ తలపడతారు. ఈ మ్యాచ్‌లు ఉదయం 11.30 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top