త్రిపాఠి తడాఖా | Rahul Tripathi's belligerent knock of 93 off just 52 | Sakshi
Sakshi News home page

త్రిపాఠి తడాఖా

May 4 2017 12:58 AM | Updated on Sep 5 2017 10:19 AM

త్రిపాఠి తడాఖా

త్రిపాఠి తడాఖా

రాహుల్‌ త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్‌ షోకు కోల్‌కతా చెదిరింది.

52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93
కోల్‌కతాపై రైజింగ్‌ పుణే విజయం


కోల్‌కతా: రాహుల్‌ త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్‌ షోకు కోల్‌కతా చెదిరింది. రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టులో మేటి బ్యాట్స్‌మెన్‌ స్మిత్, స్టోక్స్, ధోనిలు విఫలమైన చోట అతనొక్కడే అంతా తానై నడిపించాడు. సెంచరీని చేజార్చుకున్నా... అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు త్రిపాఠి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో పుణే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. గ్రాండ్‌హోమ్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతికి సుందర్‌ సింగిల్‌ తీయగా... రెండో బంతిని ఆడిన క్రిస్టియాన్‌ సిక్సర్‌గా మలిచి పుణే విజయాన్ని ఖాయం చేశాడు. త్రిపాఠికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కోల్‌కతాకిది వరుసగా రెండో పరాజయం కాగా... రైజింగ్‌ పుణేకు ‘హ్యాట్రిక్‌’ విజయం.

విరుచుకుపడిన త్రిపాఠి: ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే జట్టును ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి ముందుండి నడిపించాడు. మరో ఓపెనర్‌ రహానే (11), కెప్టెన్‌ స్మిత్‌ (9), మనోజ్‌ తివారి (8) విఫలమైనా... ఆ ప్రభావమేమీ పడకుండా జట్టు లక్ష్యం చేరిందంటే... అది త్రిపాఠి మెరుపుల వల్లే! ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన కూల్టర్‌నీల్‌ బౌలింగ్‌లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన త్రిపాఠి చూడచక్కని బౌండరీలు, చుక్కల్ని తలపించే సిక్సర్లతో అలరించాడు. దీంతో పుణే ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని అధిగమించింది. స్టోక్స్‌ చేసింది 14 పరుగులే అయినా... కాసేపు త్రిపాఠికి అండగా నిలిచాడు. ధోని (5) విఫలం కాగా... కోల్‌కతా బౌలర్లలో వోక్స్‌ 3, ఉమేశ్‌ యాదవ్, సునీల్‌ నరైన్, కుల్దీప్‌ తలో వికెట్‌ తీశారు.

తడబడిన నైట్‌రైడర్స్‌: అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును పుణే పేసర్లు వణికించారు. ఓపెనర్‌ నరైన్‌ (0)ను ఉనాద్కట్‌ రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చగా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జాక్సన్‌ (10) వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇది మొదలు వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నైట్‌రైడర్స్‌ పరుగుల వేగం తగ్గింది. మనీశ్‌ చేసిన 37 (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) పరుగులే ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌! గంభీర్‌ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా సుందర్‌ బౌలింగ్‌లోనే నిష్క్రమించగా, యూసుఫ్‌ పఠాన్‌ (4) నిరాశ పరిచాడు. అతను ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో కోల్‌కతా 55 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో గ్రాండ్‌హోమ్‌ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు),  మనీశ్‌ పాండే (32 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో పాండే వరుసగా మూడు ఫోర్లు బాదగా, వరుసటి ఓవర్‌ వేసిన తాహిర్‌ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్‌ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝళిపించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. ఉనాద్కట్, సుందర్‌ చెరో 2 వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement