ప్రమాణాలు పెంచింది

ప్రమాణాలు పెంచింది


భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రకాశ్ పదుకొనే, గోపీచంద్ తర్వాత చాలాకాలం పాటు మరో పెద్ద ఆటగాడు రాలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తర్వాత ఒక్కసారిగా ఈ ఆటపై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత క్రమంగా గోపీచంద్ అకాడమీలో ఆటగాళ్ల సంఖ్య పెరగడం... అంతర్జాతీయ టోర్నీల్లో సైనా విజయాలు, సింధు సంచలనాలతో భాగ్యనగరం బ్యాడ్మింటన్ హబ్‌గా మారింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం గెలిచిన తర్వాత ఇది మరింత జోరందుకుంది. సౌకర్యాలు ఉన్నచోటే ఆటగాళ్ల సంఖ్య పెరగడం సహజమే కాబట్టి... హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు బయటకు వచ్చారు. గోపీచంద్ చీఫ్ కోచ్ కావడం వల్ల జాతీయ క్యాంప్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంది. సైనా లండన్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆమెతో పాటు సింధు కూడా అంతర్జాతీయ వేదికల్లో నిలకడగా రాణించి పతకాలు తేవడం పెరిగింది. ఇదే సమయంలో ప్రత్యేకంగా డబుల్స్ కోచ్‌ను నియమించడం సహా గోపీ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ఈసారి భారత్ నుంచి అనూహ్యంగా ఏడుగురు అర్హత సాధించారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులే కావడం విశేషం. ఈసారి సింధు రజతం గెలిచి బ్యాడ్మింటన్‌లో మన స్థాయిని మరింత పెంచింది. నిజానికి కరోలినా కాకుండా మరే క్రీడాకారిణి ఫైనల్లో ఎదురయినా ఈపాటికి తన ఖాతాలో స్వర్ణం ఉండేది. సైనా సాధించిన కాంస్యాన్ని నాలుగేళ్లలో సింధు రజతం స్థాయికి పెంచింది. కాబట్టి కచ్చితంగా ఇక తర్వాతి లక్ష్యం నాలుగేళ్ల తర్వాత టోక్యోలో స్వర్ణం గెలవడం.


 

పోటాపోటీగా...


క్రికెట్‌ను మినహాయిస్తే దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూడటం ఇప్పుడే. సింధు పతకం వల్ల దేశంలో బ్యాడ్మింటన్ గురించి చర్చ మరింత విసృ్తతంగా జరుగుతుంది. దీనివల్ల కొత్త క్రీడాకారులు వస్తారు. ఇది కూడా మంచి పరిణామం. ఒకసారి పతకం వచ్చాక ఇకపై ఆడే ప్రతి టోర్నీలోనూ సింధుపై అంచనాలు భారీగా ఉంటాయి. ఈ ఒత్తిడిని తను అధిగమించాల్సి ఉంటుంది. క్రీడాకారుల కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి. సైనా లండన్‌లో పతకం గెలిచిన విషయాన్ని ఇప్పుడు చాలామంది మరచిపోయారు. ఇంతకాలం దేశంలో నంబర్‌వన్‌గా ఉన్న సైనా స్థానాన్ని సింధు తీసుకుంది. కాబట్టి తిరిగి అగ్రస్థానానికి రావడానికి సైనా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ బాగుంటుంది. దీనివల్ల భారత బ్యాడ్మింటన్ స్థాయి మరింత పెరుగుతుంది.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top