ఆసియా క్రీడలు‌: సింధు మరో చరిత్ర

PV Sindhu in final after defeating Yamaguchi  - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా బ్యాడ్మింటన్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పసిడి పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో వరల్డ్‌ నంబర్‌ టూ యామగూచి(జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. స్వర్ణ పతక పోరుకు సిద్ధమైంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌ అనివార్యమైంది. ఈ గేమ్‌లో సింధు చెలరేగి ఆడింది. ప్రధానం  సుదీర్ఘమైన ర్యాలీతో ఆకట్టుకుని యామగూచి ఆటకట్టించింది. అదే సమయంలో ఏషియన్‌ గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది.

ఆదివారం సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకోవడం ద్వారా ఏషియన్‌ గేమ్స్‌ మహిళల సింగిల్స్‌లో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత క్రీడాకారిణులుగా సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, పైనల్‌కు చేరడం ద్వారా కనీసం రజతాన్ని ఖాయం చేసుకుని సింగిల్స్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. మరొకవైపు ఇప‍్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన వారు లేదు. ఆసియా క్రీడా బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌ ఇప‍్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్‌ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్‌ మోదీ కాంస్య గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోగా, తాజా ఏషియన్‌ గేమ్స్‌లో సింధు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, సైనా కాంస్యాన్ని సాధించింది. మంగళవారం జరిగే పసిడి పతక పోరులో తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది.

అంతకుముందు జరిగిన మరొక సెమీ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశే ఎదురైంది. సైనా నెహ్వాల్‌ 17-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. దాంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఏషియన్‌ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కాంస్యంతోనే సరిపెట్టుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top