అమెరికా, ఒమన్‌లకు వన్డే హోదా | Sakshi
Sakshi News home page

అమెరికా, ఒమన్‌లకు వన్డే హోదా

Published Fri, Apr 26 2019 2:26 AM

Oman And USA Secure ODI status in Mens Cricket - Sakshi

దుబాయ్‌: అగ్రరాజ్యం అమెరికాతో పాటు మధ్య ఆసియా దేశం ఒమన్‌లకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే జట్ల హోదా దక్కింది. బుధవారం జరిగిన ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌–2లో ఒమన్‌ నాలుగు వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్‌–2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్‌ ఉన్నాయి. 2023లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ నాలుగు జట్ల మధ్య రాబోయే రెండున్నరేళ్లలో 36 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఒమన్‌ను ఒడ్డెక్కించిన హైదరాబాదీ సందీప్‌ గౌడ్‌ 
ఒమన్‌ జట్టు ఐసీసీ వన్డే హోదా సాధించడంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్‌ సందీప్‌ గౌడ్‌ (53 బంతుల్లో 57 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కీలక పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య నమీబియా తొలుత 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్‌ 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సందీప్‌ ఒత్తిడిని తట్టుకుని నిలిచాడు. దీంతో ఒమన్‌ మరో ఐదు బంతులు ఉండగానే, 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు పంజాబ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ సూరజ్‌ కుమార్‌ (51) ఒమన్‌ ఛేదనను ముందుకు నడిపించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement