ఎంఎస్‌కేకు గుడ్‌ బై.. కొత్త చీఫ్‌ సెలక్టర్‌ ఎవరు?

MSK Prasad's Replacement To Be Named Soon, Ganguly confirms - Sakshi

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ను మార్చాలనే వాదన వినిపిస్తోంది.  ఒక చీఫ్‌ సెలక్టర్‌గా ఎంఎస్‌కే సక్సెస్‌ అయినప్పటికీ ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ జట్టును ఎంపిక చేసే క్రమంలో అతనికి నిబద్ధత లోపించిందనే విమర్శలు వచ్చాయి. అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల కూడా ఎంఎస్‌కే సెలక్షన్‌పై అసంతృప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా క్రికెట్‌ ఆడిన అనుభవం లేని ఎంఎస్‌కేను ఎంతకాలం చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగిస్తారని వెటరన్‌ క్రికెటర్ల కూడా ప్రశ్నించారు. ఇక చీఫ్‌ సెలక్టర్‌గా ఎంఎస్‌కే గుడ్‌ బై చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇటీవల హర్భజన్‌ కూడా విన్నవించాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్‌ గంగూలీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని భజ్జీ ధీమా కూడా వ్యక్తం చేశాడు.

అయితే అందుకు ముందుడగు పడినట్టే కనబడుతోంది. తాజాగా హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ..  సెలక్షన్‌ కమిటీలో మార్పులు తప్పవనే సంకేతాలిచ్చాడు. కాకపోతే  ప‍్రస్తుతం ఉన్న సెలక్షన్‌ కమిటీని మొత్తం ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదన్నాడు. ప్రధానంగా ఇద్దరి సభ్యుల్ని మార్చితే సరిపోతుందన్నాడు. ఈ నియామకాన్ని కొత్త ఏర్పాటు చేయబోయే క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) చూసుకుంటుందన్నాడు. సీఏసీ ఏర్పాటు చేయడానికి మరో రెండు-మూడు రోజుల సమయం పడుతుందన్నాడు. ఆ తర్వాత సెలక్షన్‌ కమిటీలో మార్పులు ఉంటాయని స్పష్టం చేశాడు.

దాంతో సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉ‍ద్వాసన తప్పక పోవచ్చు. ఎంఎస్‌కే పదవీ కాలం వరల్డ్‌కప్‌తోనే ముగిసినప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఆ సమయం దాటి పోవడంతో చీఫ్‌ సెలక్టర్‌నే తొలుత మార్చే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా ఎంఎస్‌కేకు అవకాశం ఇవ్వడం కూడా అతని మార్పు అనివార్యం కాక తప్పదు. భారత క్రికెట్‌ జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌గా మూడేళ్లు పని చేయడం అంటే అది చాలా ఎక్కువ. అదే సమయంలో లోధా నిబంధనల ప్రకారం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లే అ‍య్యింది. దాంతో ఎంఎస్‌కే మార్పు అనివార్యం. ఇప్పుడు తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరు అనే  దానిపై ఉత‍్కంఠ నెలకొంది.మరొకవైపు సెలక్టర్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన గగన్‌ ఖోడా స్థానంలో కూడా మరొక సెలక్టర్‌ రానున్నాడు. ప్రస్తుత సెలక్షన్‌ కమిటీలో దేవాంగ్‌ గాంధీ, జతిన్‌ పరాన్‌జపి, శరణ్‌దీప్‌ సింగ్‌లు ఉన్నారు. వీరు పదవీ కాలం మరో ఏడాది ఉంది. దాంతో వీరిని సెలక్షన్‌ కమిటీలో కొనసాగించి ఒక చీఫ్‌ సెలక్టర్‌ను, మరొక సెలక్టర్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top