నగరంలో ధోని

MS Dhoni in Visakhapatnam Airport - Sakshi

విమానాశ్రయంలో సాదర స్వాగతం

నేడు భారత్,ఆస్ట్రేలియా జట్ల రాక

విశాఖ స్పోర్ట్స్‌: వన్డేలలో భారత్‌కు ఎంతో అచ్చి వచ్చిన స్టేడియం అది. మొదలైన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ మీద చిరస్మరణీయ విజయాన్ని అందించిన మైదానమది. తర్వాత మెన్‌ ఇన్‌ బ్లూకు విజయ పరంపరను అందించిన క్రీడాంగణమది. అలాటి స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా భారత్‌కు వేరే ఫలితం ఎలా వస్తుంది? అందుకే ఇక్కడ ‘జరిగిన’ తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ దుమ్ము రేపింది. టీ20 సిరీస్‌లో గెలవాలన్న ఆరాటంతో భారత్‌ వచ్చిన శ్రీలంక జట్టు విశాఖలో జరిగిన మ్యాచ్‌ కారణంగానే సిరీస్‌ చేజార్చుకుంది. అలా అతిథి జట్టుకు మరోసారి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది వైఎస్సార్‌ స్టేడియం.

మూడేళ్ల క్రితం భారత పర్యటనలో శ్రీలంక జట్టు సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను విశాఖలో ఆడింది. చెరో మ్యాచ్‌ గెలిచి రెండు జట్లూ సమ ఉజ్జీగా నిలవగా, విశాఖలో జరగిన ఆఖరి మ్యాచ్‌లో విజయభేరి మోగించి, భారత్‌ సిరీస్‌ను గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం (2016 ఫిబ్రవరి 14)డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ  స్టేడియంలో విశాఖ క్రీడాభిమానులకు చిరస్మరణీయ జ్ఞాపకాన్ని పంచి ఇస్తూ, భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌  కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది.

ఆడుకున్న బౌలర్లు
 ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఏమాత్రం సత్తా లేని శ్రీలంక బ్యాటింగ్‌ లైనప్‌తో ఆడుకున్నారు. గురితప్పని బౌలింగ్‌తో ఆ జట్టును చిందరవందర చేశారు. శ్రీలంక 18 ఓవర్లు ఆడి 82 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత్‌ ఆడుతూ పాడుతూ పధ్నాలుగో ఓవర్లోనే విజయభేరి మోగించింది. శ్రీలంక 12 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోగా 21 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను చేజార్చుకుంది  ఎండి శనక అత్యధికంగా 19 పరుగులు చేయగా, ఎన్‌ఎల్‌టీసీ పెరీరా12 పరుగులు సాధించాడు. శ్రీలంక జట్టులో వీరిద్దరే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. అశ్విన్‌ ఎనిమిది పరుగులిచ్చి నలుగుర్ని పెవిలియన్‌ దారిపట్టించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రైనా ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా, బుమ్రా, నెహ్రా ఒకో వికెట్‌ తీసి శ్రీలంకను మూడంకెల స్కోర్‌ చేయకుండా నిలువరించారు.  ఇక భారత్‌ తరపున ధావన్‌ (46), రహానే (22) జోడీ జట్టుకు విజయాన్నందించారు. రోహిత్‌ 13 పరుగుల వద్ద చమీరాకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్‌ చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయ భేరి మోగించగా... విశాఖ క్రీడాభిమానులకు ఆఖరి టీ20 ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయంది.

తొలి టీ20 వర్షార్పణం
2012 సంవత్సరం. సెప్టెంబర్‌. జోరందుకుంటున్న పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో వైఎస్‌ఆర్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 8న నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. న్యూజిలాండ్, భారత్‌ జట్లు రెండూ మ్యాచ్‌ ఆడేందుకు స్టేడియంకు వచ్చాయి. అప్పటికే మేఘావృతమైన ఆకాశం ఆరోజు కుండపోతగా వర్షాన్ని కురిపించింది. దాందో ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో విశాఖ క్రీడాభిమానులు తొలి టీ20 మ్యాచ్‌ను చూడలేకపోయారు.  మరో నాలుగేళ్లకు గానీ ఈ స్టేడియంలో టీ20 మ్యాచ్‌ జరగలేదు. అప్పుడే క్యాన్సర్‌ నుంచి తేరుకున్న యవరాజ్‌ సింగ్‌ ఈమ్యాచ్‌ ఆడేందుకు విశాఖ వచ్చాడు. వర్షం కారణంగా రద్దయిపోయిన ఈ మ్యాచ్‌లో కాస్త తెరిపిచ్చిన సమయంలో యువీ స్టేడియం నలుదిశలా కలయతిరిగి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. యువరాజ్‌ సింగ్‌కు విశాఖవాసులు నీరాజనాలు పట్టారు. ఈమ్యాచ్‌లో ఆడేందుకు కోహ్లి అప్పట్లో జట్టు సభ్యుడి వచ్చాడు. అయితే విశాఖ వేదికగా  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు అతడు రాలేదు. ఈసారి కోహ్లి నాయకత్వంలోనే వస్తున్న జట్టు విశాఖ వాసులకు మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ను ఈనెల 24న వీక్షించే అవకాశం కల్పించనుంది.

వెల్‌కమ్‌ మహీ!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్‌ ప్లేయర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ విశాఖ వచ్చేశాడు. ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌ కోసం ధోనీ అందరు ఆటగాళ్ల కన్నా ముందుగా విశాఖ గడ్డ మీద గురువారమే కాలుమోపాడు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ధోనీకి ఘనస్వాగతం లభించింది. రాయపూర్‌ నుంచి విమానంలో వచ్చిన ఆయనను ఇక్కడ అధిక సంఖ్యలో అభిమానులు కలిసి కరచాలనాలు చేశారు. ధోనీ...ధోనీ...అంటూ నినాదాలు చేశారు. కేరింతలు కొట్టారు.

మూడేళ్ల క్రితం విశాఖలో
‘తొలి’ టీ20 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయభేరి
ఈ గెలుపుతోభారత్‌ సిరీస్‌ కైవసం
2012లో జరగాల్సిన మొదటి మ్యాచ్‌ వర్షార్పణం
భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ రద్దు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top