అర్థం చేసుకున్నందుకు సంతోషం : మిథాలీ

Mithali Raj Thanks Understanding Fans After Slow - Sakshi

ప్రావిడెన్స్‌ : క్రికెట్‌లోని పరిస్థితులను అర్థం చేసుకున్నందుకు సంతోషకరమని టీమిండియా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ట్వీట్‌ చేసింది. గురువారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ గర్ల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అ6యితే టీ20 ఫార్మాట్‌కు ఆమె పనికి రాదని, చాలా నెమ్మదిగా ఆడే మిథాలీని టీ20ల నుంచి పక్కకు పెట్టాలని కామెంట్‌ చేసిన అభిమానులే.. తాజా మ్యాచ్‌లో ఆమె ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘క్రికెట్‌లో స్లో వికెట్‌, కఠిన పరిస్థితులను అభిమానులు అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెమీస్‌లో కూడా మంచి పరిస్థితులుంటాయని అనుకుంటున్నా’ అని ట్వీట్‌ చేసింది.

బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పై మిథాలీ నిలకడగా ఆడుతూ 4 ఫోర్ల సాయంతో 56 బంతుల్లో 51 పరుగులు చేసింది. ఈ కీలక ఇన్నింగ్స్‌కు తోడు స్పిన్నర్లు రాణించడంతో భారత్‌, ఐర్లాండ్‌పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 

గప్టిల్‌ను అధిగమించిన మిథాలీ...
మిథాలీకి ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఇప్పటికే రోహిత్‌ను అధిగమించి భారత తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  తాజా ప్రదర్శనతో.. పురుషుల జట్టులో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గఫ్తిల్‌(2271)ను అధిగమించింది. 85 టీ20 మ్యాచ్‌ల్లో ఈ హైదరాబాదీ బ్యాట్స్‌వుమెన్‌ 37.43 సగటుతో 2,283 పరుగులు చేసింది. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ 4వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ బేట్స్‌ (2,913) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విండీస్‌ ప్లేయర్‌ టేలర్‌ (2691), ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఎడ్వర్డ్స్‌(2605), మిథాలీ కన్నా ముందున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top