అరుదైన గౌరవం | manohar Rare honor in world cycling | Sakshi
Sakshi News home page

అరుదైన గౌరవం

May 18 2014 12:24 AM | Updated on Sep 2 2017 7:28 AM

భారతదేశంలో సైక్లింగ్‌ను ప్రమోట్ చేసినందుకు గుర్తింపుగా హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డీవీ మనోహర్‌కు వరల్డ్ సైక్లింగ్ అయన్స్ స్టీరింగ్ బోర్డు (డబ్ల్యూసీఏ) సభ్యునిగా అరుదైన గౌరవం దక్కింది.

సనత్‌నగర్, న్యూస్‌లైన్: భారతదేశంలో సైక్లింగ్‌ను ప్రమోట్ చేసినందుకు గుర్తింపుగా హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డీవీ మనోహర్‌కు వరల్డ్ సైక్లింగ్ అయన్స్ స్టీరింగ్ బోర్డు (డబ్ల్యూసీఏ) సభ్యునిగా అరుదైన గౌరవం దక్కింది. యూరోపియన్ సైక్లింగ్ ఫెడరేషన్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన బైసైక్లింగ్ క్లబ్‌లతో మిళితమై ఉన్న డబ్ల్యూసీఏలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఒకే ఒక్కరు మనోహర్. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో వెలో-సిటీ గ్లోబల్ 2014 పేరిట ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్న వార్షిక ప్రపంచ సైక్లింగ్ సమావేశానికి సైతం ఆయనకు ఆహ్వానం లభించింది.
 
 దేశాభివృద్ధికి సైక్లింగ్ ఏవిధంగా తోడ్పడుతుందనే విషయమై 26, 27 తేదీల్లో ‘ది హెర్క్యులీన్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ సైక్లింగ్ ఇన్ ఇండియా’ అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. కేవలం పది మంది సభ్యులతో 2007లో డీవీ మనోహర్ ప్రారంభించిన హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్...పస్తుతం 5,160 మంది సభ్యులకు చేరింది. నగరంలో సైక్లింగ్ వ్యవస్థను విస్తృతం చేసేందుకు మనోహర్ కంకణం కట్టుకున్నారు.
 
 మెట్రోస్టేషన్లలో సైకిళ్లు....
 హైదరాబాద్ మెట్రోరైల్ స్టేషన్ల వద్ద సైకిళ్లను అందుబాటులో ఉంచి సైక్లింగ్‌ను మరింత విస్తృ తం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మెట్రోరైల్ దిగిన ప్రయాణికులు సైకిళ్లను తీసుకొని తమ పని ముగించుకున్నాక సమీపంలోని ఏ మెట్రోస్టేషన్‌లోనైనా అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మనోహర్ తెలిపారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట సైక్లింగ్ రేసులను నిర్వహిస్తున్నారు. ఇక వారాంతంలోనైతే దూర ప్రాంతాలకు సైకిళ్లపై సవారీ చేస్తూ పర్యావరణానికి, ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంత మేలు చేస్తుందో వివరిస్తున్నారు.
 
 డబ్ల్యూసీఏ సభ్యునిగా భారత్ నుంచి ఎంపికైన డీవీ మనోహర్...(ఫైల్)
 

Advertisement
Advertisement