మన సారథులు మళ్లీ నం.1

Kohli, Mithali Raj in ICC 'Top' rankings - Sakshi

ఐసీసీ ‘టాప్‌’ ర్యాంకుల్లో కోహ్లి, మిథాలీ రాజ్‌  

దుబాయ్‌: భారత క్రికెట్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, మిథాలీ రాజ్‌ టాప్‌ లేపారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల కేటగిరీల్లో మనవాళ్లే అగ్రస్థానంలో ఉన్నారు. బ్యాటింగ్‌ సంచలనం విరాట్‌ కోహ్లి పది రోజుల వ్యవధిలోనే తిరిగి నంబర్‌ వన్‌ ర్యాంకుకు ఎగబాకాడు. ఈ క్రమంలో సచిన్‌ 19 ఏళ్ల క్రితంనాటి రేటింగ్‌ పాయింట్ల రికార్డును 28 ఏళ్ల ఈ భారత సారథి అధిగమించాడు. కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. 1998లో సచిన్‌ పేరిట ఉన్న 887 రేటింగ్‌ పాయింట్ల రికార్డును చెరిపేశాడు. రోహిత్‌ శర్మ కూడా తన కెరీర్‌లోనే ఉత్తమ రేటింగ్‌ (799) పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్‌ ధోని ఒక స్థానాన్ని మెరుగు పర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. కివీస్‌తో సిరీస్‌లో అతను 6 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్‌ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది.

మహిళల్లో మిథాలీ...
భారత మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కూడా అగ్రస్థానానికి చేరింది. తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్‌ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ క్రికెటర్‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్‌ (న్యూజిలాండ్‌; 720) నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో భారత వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి నిలకడగా రెండో స్థానంలోనే ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top