
నాకౌట్ ఆశలు గల్లంతు
రంజీ ట్రోఫీలో ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు దేశవాళీ వన్డేల్లోనూ అదే బాట పట్టింది.
బెంగళూరు: రంజీ ట్రోఫీలో ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ ఇప్పుడు దేశవాళీ వన్డేల్లోనూ అదే బాట పట్టింది. గత మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో చిత్తుగా ఓడిన జట్టు...ఇప్పుడు ఆంధ్ర చేతిలోనూ పరాజయం పాలైంది.
సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో భాగంగా సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి ముందుగా హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలగా, ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తాజా ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. సౌత్‌జోన్ నుంచి తమిళనాడు, కర్ణాటక జట్లు అర్హత సాధించాయి.
ఆదుకున్న విహారి, హబీబ్...
టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 7 పరుగులకే ఓపెనర్లు సుమన్ (5), అక్షత్ (1) పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) ఆదుకున్నాడు. రవితేజ (11)తో కలిసి అతను మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. అయితే రవితేజతో పాటు సందీప్ రాజన్ (7), విహారి వెంటవెంటనే వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న ఆశిష్ రెడ్డి (9)తో పాటు షిండే (15), కనిష్క్ (0) కూడా ఏడు పరుగుల వ్యవధిలోనే నిష్ర్కమించారు.
అయితే వికెట్ కీపర్ హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఆటగాళ్లు ఓజా (11), రవికిరణ్ (11)ల అండతో అతను స్కోరును 150 పరుగులు దాటించాడు. ఆంధ్ర బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, విజయ్‌కుమార్‌కు 2 వికెట్లు దక్కాయి.
గెలిపించిన భరత్...
సునాయాస విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 9 పరుగుల వద్ద ఓపెనర్ ప్రశాంత్ (6) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ శ్రీకర్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో వికెట్‌కు జ్యోతి కృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) తో 60 పరుగులు జోడించిన భరత్, మూడో వికెట్‌కు బోడ సుమంత్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)తో 56 పరుగులు జత చేశాడు. భరత్ వెనుదిరిగినా...రికీ భుయ్ (28 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) మ్యాచ్‌ను ముగించాడు.