‘ఉత్తరాది’ రాత మారుతుందా?

Kings xi punjab team Ipl League is limited to the stage - Sakshi

ఐపీఎల్‌లో పదకొండు సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా టైటిల్‌ ఆనందం దక్కని జట్లలో ఢిల్లీ, పంజాబ్‌ ఉన్నాయి. లీగ్‌ తొలి ఏడాది 2008లో టాప్‌ స్టార్లతో అంచనాలను అందుకుంటూ తమ స్థాయిని ప్రదర్శించి ఈ రెండు టీమ్‌లు సెమీఫైనల్‌ చేరాయి. ఆ తర్వాత పది ప్రయత్నాల్లో ఎక్కువ సార్లు నిరాశే మిగిలింది. 2014లో రన్నరప్‌గా నిలవడం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో పంజాబ్‌ లీగ్‌ దశకే పరిమితమైంది. 

మరోవైపు ఢిల్లీ 2009లో సెమీస్, 2012లో ప్లే ఆఫ్స్‌ దశకు వెళ్లినా... 2013 నుంచి 2018 మధ్య ఆరేళ్లలో మూడుసార్లు చివరి స్థానంలోనే నిలవడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారడంతో పాటు సహాయక సిబ్బందిని కూడా చాలా వరకు మార్చుకొని కొత్త ఆశలతో బరిలోకి దిగుతుండగా... గతేడాది ఆరంభంలో అద్భుతంగా దూసుకుపోయి ఆ తర్వాత చతికిలపడ్డ∙పంజాబ్‌ పాఠాలు నేర్చుకొని మైదానంలోకి వస్తోంది. 

కుర్ర ‘త్రయం’... 
బలాలు: ఢిల్లీ బ్యాటింగ్‌ ప్రధానంగా నలుగురు భారత ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. టీమిండియా రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను ఈసారి జట్టు కొత్తగా తెచ్చుకుంది. ధావన్‌ రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అతనితో పాటు మరో ముగ్గురు యువ ఆటగాళ్లు జట్టు రాతను ప్రభావితం చేయగలరు. విధ్వంసక ఆటతో ఇప్పటికే భారత టీమ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రిషభ్‌ పంత్‌ ఆ జట్టు ప్రధాన బలం. పంత్‌తో పోటీ పడుతూ చెలరేగిపోగల శ్రేయస్‌ అయ్యర్‌ కూడా జట్టులో ఉన్నాడు. పంత్‌ గత ఏడాది ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధసెంచరీలు సాధించగా, అయ్యర్‌ నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. వీరితో పాటు పృథ్వీ షా స్ట్రోక్‌ ప్లే కూడా కీలకం కానుంది. ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, బండారు అయ్యప్ప జట్టులో ఉన్నా... వారికి ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం లభిస్తుందనేది చూడాలి. విదేశీ ఆటగాళ్లలో భారీ హిట్టర్లయిన ‘కొలిన్‌ ద్వయం’ మున్రో, ఇంగ్రామ్‌ చెలరేగి శుభారంభం అందించగలరు. క్రిస్‌ మోరిస్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంపై కూడా జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో స్టార్‌ పేసర్లు బౌల్ట్, రబడ పేస్‌ బాధ్యత తీసుకుంటారు. భారత పేసర్లలో అవేశ్‌ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. ఇషాంత్‌ శర్మ కూడా ఈసారి సొంత జట్టు తరఫున ఆడుతున్నాడు. నేపాల్‌ లెగ్‌స్పిన్నర్‌ సందీప్‌ లమిచానే అందుబాటులో ఉన్నా... నలుగురు విదేశీయుల పరిమితిలో అతనికి అవకాశం దక్కడం అంత సులువు కాదు.  

బలహీనతలు: ధావన్‌ గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్‌ తరఫున గొప్పగా ఏమీ ఆడలేదు. మరోవైపు నుంచి వార్నర్‌ జోరులో అతని లోపాలు తెలియలేదు. ఫామ్‌ కోల్పోవడంతోనే రైజర్స్‌ అతడిని వదిలేసుకుంది. ఇప్పుడు అతను ఎంత ప్రభావం చూపిస్తాడనేది ముఖ్యం. గత ఏడాది ఢిల్లీ తరఫు నుంచే మున్రో ఐదు ఇన్నింగ్స్‌లలో 3 సార్లు డకౌట్‌ కాగా, భారత్‌లో ఇంగ్రామ్‌ ఆటపై సందేహాలున్నాయి.నిరంతరాయంగా దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్న రబడ వరల్డ్‌ కప్‌కు ముందు అన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగే అవకాశం తక్కువ. ప్రధాన స్పిన్నర్లుగా భావిస్తున్న అక్షర్‌ పటేల్, అమిత్‌ మిశ్రా ఇటీవలి ప్రదర్శన అంతంత మాత్రమే. టి20 క్రికెట్‌లో ఇషాంత్‌ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! మొత్తంగా చూస్తే మెరుపు బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేస్తే క్యాపిటల్స్‌ విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. రికీ పాంటింగ్‌ కోచ్‌గా, సౌరవ్‌ గంగూలీ సలహాదారుడిగా ఉన్న ఈ జట్టుకు వారి మార్గనిర్దేశనం ఎంత వరకు పని చేస్తుందో చూడాలి.  

లీగ్‌లో ఉన్న ఎనిమిది టీమ్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరని జట్టు ఇదే. ఢిల్లీ క్యాపిటల్స్‌ (డేర్‌డెవిల్స్‌) 2018లో 14 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచి, 9 ఓడింది.  

జట్టు వివరాలు
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ఇషాంత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్, పృథ్వీ షా, హనుమ విహారి, మన్‌జోత్‌ కల్రా, నాథు సింగ్,  రాహుల్‌ తేవటియా, అంకుశ్‌ బైన్స్, అవేశ్‌ ఖాన్, అక్షర్‌ పటేల్, హర్షల్‌ పటేల్, అమిత్‌ మిశ్రా, జలజ్‌ సక్సేనా, బండారు అయ్యప్ప (భారత ఆటగాళ్లు), రబడ, మోరిస్, లమిచానే, మున్రో, ఇంగ్రామ్, బౌల్ట్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్‌ (విదేశీ ఆటగాళ్లు).  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top