మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ వివాదం మరో మలుపు తిరిగింది
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ వివాదం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు వీరేందర్ యాదవ్‌పై దాడి చేసిన ఆరోపణలపై గత నెల 26న కన్వల్‌పై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తదనంతర పరిణామాల్లో హెచ్‌సీఏ కన్వల్జిత్‌ను సస్పెండ్ చేసింది. అయితే తనపై సస్పెన్షన్ విధించడం అన్యాయమని ఈ మాజీ స్పిన్నర్ కోర్టుకెక్కారు. సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ‘క్వాష్ పిటిషన్’ దాఖలు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వినోద్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. దీనిపై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. సోమవారానికి కేసు వాయిదా పడింది.