
ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే..
పెర్త్ : ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ ఘోర పరాజాయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు గొడవపడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. నాలుగో రోజు (సోమవారం) ఆటలో భాగంగా ఫీల్డింగ్ మార్పులో తలెత్తిన వివాదం ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. అయితే వీరి వాగ్వాదాన్ని గమనించిన పేస్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందివ్వడానికి మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌లు వారికి సర్ధిచెప్పారు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా లేనప్పటికి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు. దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో.. జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. అయితే వీరు హిందీలో తిట్టుకున్నట్లు తెలుస్తున్నా.. మైదానం మధ్యలో గొడవపడటంతో వారి మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అవ్వలేదు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒత్తిడి కారణంగానే ఇషాంత్ శర్మ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక వీరి ప్రవర్తన పట్ల మాజీ ఆటగాళ్లు, అభిమానులు మండిపడుతున్నారు. ఒకే జట్టు ఆటగాళ్లు గొడవపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో గొడవపడటం చూశాం.. కానీ సహచర ఆటగాళ్లు వాదులాడుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.