నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి విజయం దక్కింది.
మెల్‌బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి విజయం దక్కింది. గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్‌లో చివరి క్వార్టర్‌లో అద్భుతంగా ఆడిన భారత జట్టు 4-2తో మలేసియాపై నెగ్గింది. నికిన్ తిమ్మయ్య (24, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ (31వ ని.) గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. చివర్లో ఆకాశ్‌దీప్ (56) చేసిన గోల్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ 2-3 గోల్స్‌తో ఓడింది.
గోవాపై కోల్‌కతా విజయం
ఫటోర్డా: తమ చివరి మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించిన అట్లెటికో డి కోల్‌కతా జట్టు గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవాపై 2-1తో విజయం సాధించింది. కోల్‌కతా నుంచి బెలెన్‌కోసో (28), పియర్సన్ (90) గోల్స్ చేయగా గోవా నుంచి మందర్ దేశాయ్ (80) ఏకై క గోల్ సాధించాడు.