భారత్‌ వృద్ధి బాట పటిష్టం!

India growth prospects - Sakshi

అంతర్జాతీయ ద్రవ్యనిధి విశ్లేషణ

2018–19లో వృద్ధి 7.3 శాతం

2019–20లో 7.5 శాతం అంచనా  

న్యూయార్క్‌: భారత్‌ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 2018–2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019–2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్‌ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... 

సమీప భవిష్యత్‌తో భారత్‌ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్‌ బాగుంది.  ద్రవ్యోల్బణం 2018–19లో 5.2 శాతంగా ఉంటుంది. డిమాండ్‌ పరిస్థితులు పటిష్టంగా ఉండడం, రూపాయి విలువ క్షీణత, చమురు ధరలు, హౌసింగ్‌ రెంట్‌ అలవెన్స్‌ల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు దీనికి కారణం.   2018–19కి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు 2.6%గా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల, దిగుమతులకు డిమాండ్‌ దీనికి కారణం.  భారత్‌ ఫైనాన్షియల్‌ రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు కట్టడికి తగిన చర్యలు ఉన్నాయి. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మెరుగుపడుతోంది. బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో చర్యలు ఉన్నాయి.  

 రానున్న కొద్ది దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కీలకపాత్ర పోషించనుందని ఐఎంఎఫ్‌ మిషన్‌ చీఫ్‌ (ఇండియా) రానిల్‌ సెల్‌గాడో పేర్కొన్నారు. ఈ విషయంలో గత చైనా పాత్రను ఇకపై భారత్‌ పోషించే వీలుందని అన్నారు.  2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్, ఆ తర్వాత జీఎస్‌టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతోంది ఇటీవలి రేట్ల పెంపు సరైనదే. రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top