ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. చివరకు అదే రీతిలో నిష్ర్కమించింది.
సిడ్నీ: ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. చివరకు అదే రీతిలో నిష్ర్కమించింది. ఈ మెగా ఈవెంట్ ముందు వరస పరాజయాలతో ఢీలాపడటంతో ధోనీసేనపై పెద్దగా అంచనాలు లేకపోయాయి. అయితే ప్రపంచ కప్లో భారత్ అద్భుతాలు చేసింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఆరు జట్లనూ ఆలౌట్ చేసింది. అంటే భారత బౌలర్లు 60కి 60 వికెట్లు పడగొట్టారు. ఇది ప్రపంచ కప్ రికార్డు. ఇక క్వార్టర్స్లోనూ భారత్.. బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసింది. ధోనీసేన వరుస అత్యధిక విజయాలతో మరో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సెమీస్లో భారత్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంగారూలను కట్టడి చేస్తుందని భావించారు. అయితే సెమీస్ పోరు అంచనాలకు భిన్నంగా సాగింది. ధోనీసేన ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఆలౌట్ చేసిన భారత బౌలర్లు తేలిపోగా.. మన బ్యాట్స్మెన్ బ్యాట్లెత్తేసి ఆలౌటయ్యారు. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఆసీస్ ఘనవిజయంతో ఫైనల్ చేరగా.. ధోనీసేన పేలవ ముగింపుతో టైటిల్ ఆశలను ఆవిరి చేసుకుంది.