గెలిపించిన ఆశిష్ రెడ్డి | Imposible Ashish | Sakshi
Sakshi News home page

గెలిపించిన ఆశిష్ రెడ్డి

Mar 6 2014 1:44 AM | Updated on Sep 2 2017 4:23 AM

గెలిపించిన ఆశిష్ రెడ్డి

గెలిపించిన ఆశిష్ రెడ్డి

సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్యపిళ్లై ట్రోఫీ)ని హైదరాబాద్ జట్టు ఉత్కంఠభరిత విజయంతో ముగించింది. ఓటమికి చేరువైన దశలో ఆశిష్ రెడ్డి (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు.

 బెంగళూరు: సౌత్‌జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్యపిళ్లై ట్రోఫీ)ని హైదరాబాద్ జట్టు ఉత్కంఠభరిత విజయంతో ముగించింది. ఓటమికి చేరువైన దశలో ఆశిష్ రెడ్డి (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు.

ఫలితంగా బుధవారం ఇక్కడి ఆదిత్య అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ వికెట్ తేడాతో గోవాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేయగా, అనంతరం హైదరాబాద్ 49.4 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులు చేసింది. టోర్నీలో ఆడిన 5 మ్యాచుల్లో 2 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మరో మ్యాచ్‌ను ‘టై’గా ముగించింది. మొత్తం 10 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
 

 రెండు సెంచరీలు...

 టాస్ గెలిచిన గోవా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అమోఘ్ దేశాయ్ (8) ఆరంభంలోనే వెనుదిరగ్గా, కొద్ది సేపటికే బేలేకర్ (44 బంతుల్లో 30; 4 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరాడు. అయితే ఈ దశలో షగున్ కామన్ (109 బంతుల్లో 112; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కీనన్ వాజ్ (100 బంతుల్లో 111; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో చెలరేగి గోవా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 26.4 ఓవర్లలోనే 182 పరుగులు జోడించారు. వీరిద్దరు తక్కువ వ్యవధిలోనే అవుట్ కాగా...తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.  53 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ బౌలర్ రవికిరణ్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
 

రవితేజ నిలకడ...
 

అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు శుభారంభం ఇవ్వడంలో ఓపెనర్లు మరో సారి విఫలమయ్యారు. కెప్టెన్ అక్షత్ రెడ్డి (10) తొందరగానే అవుట్ కాగా, దూకుడుగా ఆడబోయిన సుమన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా వెంటనే వెనుదిరిగాడు. ఈ దశలో రవితేజ (119 బంతుల్లో 87; 5 ఫోర్లు, 1 సిక్స్), హనుమ విహారి (70 బంతుల్లో 45; 4 ఫోర్లు) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. అయితే విహారితో పాటు భండారి (18 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), సందీప్ రాజన్ (0) తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో రవితేజ, ఆశిష్ రెడ్డితో ఆరో వికెట్‌కు 43 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. ఈ స్థితిలో హైదరాబాద్  విజయానికి 52 బంతుల్లో 77 పరుగులు చేయాల్సి ఉంది. ఒక వైపు ఆశిష్ రెడ్డి పోరాడుతున్నా...మరో వైపు హబీబ్ అహ్మద్ (6), ఓజా (4 బంతుల్లో 16; 1 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిలింద్ (2) ఎక్కువ సేపు  నిలవలేకపోయారు. దాంతో ఆశిష్ ఎదురు దాడికి దిగాడు. భారీ షాట్లతో చెలరేగి మరో 2 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement