ఒకటే స్థానం ఖాళీ!

hief selector MSK Prasad reveals India most important player for 2019 World Cup - Sakshi

వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే

ఆ స్థానం కోసం చాలా పోటీ ఉంది ధోని అందరికంటే కీలకం

చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టీకరణ  

వన్డే వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా భారత జట్టు బరిలోకి  దిగబోతోంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్, ఇంగ్లండ్‌ పిచ్‌లకు సరిపోయే పదునైన  బౌలింగ్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో టీమిండియా ఇటీవలి ప్రదర్శన చూస్తే సాధారణ క్రికెట్‌ అభిమానికి కూడా వరల్డ్‌ కప్‌ జట్టులో ఎవరెవరు ఉంటారో ఒక అంచనా వచ్చేసి ఉంటుంది.  ఆసియా కప్‌ టైటిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సిరీస్‌ విజయాల తర్వాత  టీమ్‌ కూర్పుపై సెలక్షన్‌ కమిటీకి కూడా మరింత స్పష్టత లభించింది. ఇదే అంశంపై సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తన అభిప్రాయం వెల్లడించారు. 
ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని... టీమ్‌ ఎంపికపై  ఎలాంటి సందేహాలు లేకుండా మరింత స్పష్టతనిచ్చారు.  

ముంబై: వరల్డ్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయిందని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వెల్లడించారు. 15 మంది సభ్యుల జట్టులో 14 మంది విషయంలో తాము దాదాపు నిర్ణయానికి వచ్చేశామని, మిగిలిన ఒకే ఒక స్థానం కోసం గట్టి పోటీ ఉందని ఆయన చెప్పారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు జట్టు ఎంపిక సాఫీగానే అనిపించిందని, అయితే ఇటీవల అవకాశం ఇచ్చిన కుర్రాళ్లంతా సత్తా చాటడంతో తమకు ‘ఆరోగ్యకరమైన తలనొప్పి’ మొదలైందని ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. జట్టులో ధోని పాత్ర ఎంత కీలకమో కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వరల్డ్‌ కప్‌కు సంబంధించి ప్రసాద్‌ చెప్పిన విశేషాలు
ఆయన మాటల్లోనే... 

టీమ్‌ ఎంపికపై... 
వన్డేల్లో మన టీమ్‌ అద్భుత ప్రదర్శన తర్వాత వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే. ఆఖరి క్షణంలో ఒక మార్పు మినహా మిగతా ఆటగాళ్ల గురించి ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకటే స్థానం ఖాళీగా ఉంది. అది కూడా ఇటీవల కొత్త ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన తర్వాత మా తుది ఎంపికపై పునరాలోచించుకోవాల్సి వచ్చింది. బహుశా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ తర్వాత ఆ స్థానం ఖాయం అవుతుంది. 2011 వరల్డ్‌ కప్‌ తరహాలో సీనియర్లు,       జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంటుంది. అప్పుడు సచిన్, సెహ్వాగ్‌లే కాకుండా కోహ్లి, శ్రీశాంత్‌లాంటి కుర్రాళ్లూ ఉన్నారు.  

మిగిలిన స్థానానికి ఉన్న పోటీపై... 
చాలా మంది బరిలో ఉన్నారని మాత్రం చెప్పగలను. రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్, రహానేలతో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా ఇంకా రేసులోనే నిలిచారు. గత ఏడాది కాలంగా పంత్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే విజయ్‌ శంకర్‌ ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన జట్టు కూర్పు గురించి మరో కోణంలో ఆలోచించేలా చేసింది. దేశవాళీ క్రికెట్‌లో రహానే పరుగుల వరద పారించాడు కాబట్టి అతడిని ఇంకా పూర్తిగా పక్కన పెట్టలేదు. వీరందరినీ దాటాలంటే రాహుల్‌ మిగిలిన కొద్ది సమయంలో మాత్రం భారీగా పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్, రవీంద్ర జడేజా, విజయ్‌ శంకర్‌ ఉన్నారు. వీరందరినీ తెలుసుకోలేం. వరల్డ్‌ కప్‌ కోసం కొన్ని లెక్కలను చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 20 మందితో జాబితా మా ముందుంది. కాబట్టి వచ్చే ఐపీఎల్‌లో ప్రదర్శన ఎలా ఉన్నా దానిని మాత్రం ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించాం.  

మిడిలార్డర్‌ సమస్యలపై... 
ఇంగ్లండ్‌ గడ్డపై 1–2తో వన్డే సిరీస్‌ ఓడిపోయిన సమయంలో మా మిడిలార్డర్‌ సమస్యగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల తర్వాత దానికి పరిష్కారం లభించినట్లే. మిడిలార్డర్‌ బాధ్యతల గురించి స్పష్టంగా వివరించి అవకాశాలు ఇచ్చిన వారందరూ తమ పాత్రకు న్యాయం చేయడం సంతోషకరం. ఇంకా చిన్న చిన్న లోపాలేమైనా ఉంటే ఆటగాళ్లే చూసుకుంటారు. నేను ఏ ఒక్కరి పేరు చెప్పను గానీ మిడిలార్డర్‌ సమస్య తీరినట్లుగానే భావిస్తున్నాం.  

రాయుడుపై విశ్వాసం ఉంచడంపై... 
మన మిడిలార్డర్‌ పటిష్టంగా ఉండాలి. నాలుగో స్థానంలో కోసం మేం ప్రయత్నించినవారి ఆట మాకు సంతృప్తి కలిగించలేదు. ఆ స్థానంలో అనుభవంతో పాటు పరిణతి అవసరం. టి20 ఫార్మాటే అయినా ఐపీఎల్‌ ప్రదర్శనతోనే రాయుడును వన్డేలకు ఎంపిక చేశాం. తనకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్న అతను, ఆ స్థానానికి సరైనవాడినేనని నిరూపించుకున్నాడు.  

ఇద్దరు స్పిన్నర్లపైనే నమ్మకం... 
వాస్తవానికి 2017 చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాతి నుంచి మేం వరల్డ్‌ కప్‌ జట్టు నిర్మాణం గురించి ఆలోచించాం. ఆ టోర్నీలో భారత్‌ బాగానే ఆడి ఫైనల్‌ చేరింది. కానీ స్పిన్‌లో మరింత వైవిధ్యం ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే చహల్, కుల్దీప్‌లకు అవకాశాలిచ్చాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూశారుగా. వీరిద్దరు కలిసి ఆడిన మ్యాచ్‌లలో భారత్‌ 70 శాతం (27 మ్యాచ్‌లలో 19 గెలిచి, 7 ఓడింది) విజయాలు సాధించింది. వారి వల్ల బౌలింగ్‌ బలం పెరిగింది. వరల్డ్‌ కప్‌ జరిగే సమయంలో ఇంగ్లండ్‌లో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. అలాంటప్పుడు ఆఫ్‌ స్పిన్నర్లకంటే లెగ్‌ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతారు కూడా. 

ధోని పాత్ర, అతని ప్రాధాన్యతపై..
ధోని ఇప్పటికీ మ్యాచ్‌ విన్నర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్‌ కప్‌లో కూడా అందరికంటే అతనే కీలకం కానున్నాడు. విరాట్‌ కోహ్లికి సలహాలివ్వడంలో గానీ వికెట్‌ కీపర్‌గా గానీ మైదానంలో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయడంలో గానీ అతడిని మించినవారు లేరు. ఇటీవల సిరీస్‌ల తర్వాత తన సహజశైలిలో దూకుడుగా ఆడతానని ధోని సందేశం ఇచ్చేశాడు. మనందరికీ తెలిసిన పాత తరహా ధోనిలా భారీ షాట్లతో చెలరేగితే మాకందరికీ ఆనందం. మధ్యలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం వల్ల అతనిలో కొంత జోరు తగ్గి ఉండవచ్చు కానీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వరల్డ్‌ కప్‌కు ముందు ఐపీఎల్‌ సైతం ఆడతాడు కాబట్టి సమస్య లేదు. బ్యాటింగ్‌ ఫామ్‌ మాత్రం కొంత తగ్గినా... అతని కీపింగ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. విరాట్‌ చెప్పినట్లు ధోనిపై విపరీతమైన అంచనాలు ఉండటమే సమస్య. మనకెప్పుడూ ధోని తొలి రోజులు గుర్తుకొచ్చి అలాగే ఆడాలని కోరుకుంటాం. ఇప్పుడు విఫలమవుతున్నాడని విమర్శిస్తాం. కానీ అతని స్థాయి ఆటగాళ్లకు తమనుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాము విఫలమైతే వారు కూడా సహజంగానే బాధపడతారు! 

2016 సెప్టెంబర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ  బాధ్యతలు తీసుకున్న నాటినుంచి భారత్‌ 131 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే  89 గెలిచి, 33 ఓడింది. ఈ సమయంలో  భారత్‌ గెలుపోటముల నిష్పత్తి  (2.696) అన్ని జట్లకంటే చాలా ఎక్కువగా ఉంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top