ఫైనల్లో ఏం జరుగుతుందో..: డివిలియర్స్ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఏం జరుగుతుందో..: డివిలియర్స్

Published Wed, May 25 2016 4:36 PM

ఫైనల్లో ఏం జరుగుతుందో..: డివిలియర్స్

బెంగళూరు: వన్ మ్యాన్ షో తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఐపీఎల్-9 ఫైనల్స్ క్ చేర్చాడు ఏబీ డివిలియర్స్. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 79  పరుగులతో చివరివరకూ నిలిచి ఒత్తిడిని జయించాడు. గుజరాత్ లయన్స్ ను ఓడించి తన జట్టు బెంగళూరు ఫైనల్స్ కు చేరడంతో చాలా ఆనందంగా ఉందన్నాడు. అయితే ఫైనల్ కు చేరడం తనకు చాలా గొప్ప విషయమని ఏబీ అభిప్రాయపడ్డాడు. తమ జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ చాలా ఫన్నీగా ఉందని, ప్రత్యర్ధి స్కోరు 160 దాటితే కష్టమని భావించినట్లు పేర్కొన్నాడు.

తన కెరీర్ లో ఎక్కువ ఫైనల్ మ్యాచులు ఆడలేదని, అందుకే ప్రస్తుతం ఆడబోయే ఫైనల్ తనకు చాలా విలువైనదని చెప్పాడు. బెంగళూరు తరఫున ఆరేళ్లుగా ఆడుతున్నా.. ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆడలేదని ప్రస్తుతం తనకు ఆ గౌరవం దక్కుతుందన్నాడు. గుజరాత్ పై ఇన్నింగ్స్ బెస్ట్ ఇన్నింగ్స్ అని భావిస్తున్నారా అన్న మీడియా ప్రశ్నకు బదులుగా.. టీమ్ విజయానికి తోడ్పడే తన ప్రతి ఇన్నింగ్స్ విలువైనదని చెప్పాడు. గణాంకాల గురించి అసలు పట్టించుకోను.. సెంచరీలు, హాఫ్ సెంచరీల గురించి ఆలోచించను, అవి కేవలం అంకెలు మాత్రమే అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ టీమ్ స్పిరిట్ బాగుందని సహచరులను ప్రశంసించాడు.

Advertisement
Advertisement