ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ఏఐసీపీ సంస్థ ముందుకొచ్చింది.
నేడు టి10 క్రికెట్ మ్యాచ్
అమీర్‌పేట్, న్యూస్‌లైన్: ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ఏఐసీపీ సంస్థ ముందుకొచ్చింది. ఏఐసీపీ అంటే ఎనీ ఇండియన్ కెన్ ప్లే (భారతీయులెవరైనా ఆడగలరు). ఇందులో భాగంగా టి10 క్రికెట్ మ్యాచ్ నిర్వహించి నిధులు సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏఐసీపీ అధ్యక్షుడు కైలాశ్ విజయ్‌వర్గీ వెల్లడించారు. బుధవారం కులీకుతుబ్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమం మంగళవారం స్థానిక హోటల్లో జరిగింది. ఇందులో సినీతారలు తనూష, మధులగ్నదాస్‌లతో పాటు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ మ్యాచ్ ద్వారా సమకూరిన నిధుల్ని పేద క్రీడాకారులకు అందజేస్తామని కైలాశ్ తెలిపారు. ఆటగాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఏఐసీపీ తోడ్పాటునందిస్తుందన్నారు.
మ్యాచ్ వివరాలను ఆయన వెల్లడిస్తూ... సాధారణ క్రికెట్ మ్యాచ్‌లకు భిన్నంగా ఈ మ్యాచ్ ఉంటుందన్నారు. ఓవర్‌కు ఎనిమిది బంతులు, తుది జట్టుకు పది మంది ఆటగాళ్లు ఆడతారని చెప్పారు. పదేసి ఓవర్ల చొప్పున మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సినీ తారలు తనూష, మధులగ్నదాస్‌లు తమ చిన్ననాటి క్రీడల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విశాల్ అగర్వాల్, దీపక్ అశ్వ, సంకేత్ షా, హిరేన్ గజ్జార్ తదితరులు పాల్గొన్నారు.