
సోమవారం వాన బీభత్సానికి జలమయమైన అమీర్‌పేట ప్రధాన రహదారి
హైదరాబాద్‌లో కుండపోత.. 3 గంటల పాటు కురిసిన వాన
లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం
స్తంభించిన జనజీవనం... ట్రాఫిక్ చక్రబంధం
వాహన చోదకులకు నరకం
కుత్బుల్లాపూర్‌లో 15, బంజారాహిల్స్‌లో 12 సెం.మీ. వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనం అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా మూడుగంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. మరోవైపు రోడ్లపై చెట్లు విరిగి పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు వదిలే వేళ, ఉద్యోగులు ఇంటిబాట పట్టే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ముందుకు సాగేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటమునిగాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని మహదేవుపురంలో 15 సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌లో 12, యూసుఫ్‌గూడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో సగటున ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది.
రోడ్లపై నిలిచిన వరద
ఏకధాటి వర్షంతో వరద నీరు రోడ్లపై భారీగా చేరింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఇరువైపులా ఇటు నాంపల్లి వరకు అటు అమీర్‌పేట మార్గంలో వాహనాల రాకపోకలకు గంటల కొద్ది ఆటంకం ఏర్పడింది. ట్యాంక్‌బండ్–సెక్రటేరియట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
సచివాలయ బస్టాప్, సిటీ సెంట్రల్ జోన్ నీట మునిగాయి. హిమాయత్‌నగర్–నారాయణగూడ మార్గంలోనూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్ నీట మునిగింది. వందలాది మంది విద్యార్థులు స్కూల్లోనే చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి.