చిత్తుగా ఓడిన మెస్సీ సేన

FIFA World Cup Argentina Lose The Match Against Croatia With 0-3 - Sakshi

నిజ్నీ నొవొగొరొడ్‌: ఫిఫా ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు షాక్‌ తగిలింది. గ్రూప్‌ డిలో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్‌ గ్యాంగ్‌ 0-3తో ఓటమి పాలైంది. క్రొయేషియా పోటీ పడి గోల్స్‌ చేయగా మెస్సీ సేన ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేక చతికిలబడింది. ప్రధానంగా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఓటమితో అర్జెంటీనా నాకౌట్‌ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఇరు జట్లు ప్రథమార్థంలో గోల్స్‌ చేయడంలో విఫలమైతే, ద్వితీయార్థం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే అంటీ రెబిక్‌ క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం అర్జెంటీనా-క్రొయేషియాలు గోల్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా,  ఆట 80వ నిమిషంలో క్రొయెషియా ఆటగాడు బ్రొజోవిక్‌ అందించిన సహకారంతో లుకా మాడ్రిక్‌ అద్భుత గోల్‌ అందించాడు. దీంతో 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన క్రొయేషియా ప్రత్యర్థి అర్జెంటీనాకు  ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.  

అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్‌ పోస్ట్‌పై దాడి చేసినా క్రొయేషియా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. ఎక్సట్రా ఇంజూరి టైమ్‌ (90+1)లో ఇవాన్‌ రాకిటిక్‌ క్రొయేషియాకు మూడో గోల్‌ అందించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో క్రొయేషియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరెంటీనా 14 అనవసర తప్పిదాలు చేయగా, క్రొయేషియా 19 తప్పిదాలు చేసింది. అర్జెంటీనా గోల్‌ పోస్ట్‌పై ఏడు సార్లు దాడి చేయగా, క్రొయేషియా తొమ్మిది సార్లు దాడి చేసింది. ఈ మ్యాచ్‌లో నలుగురు క్రొయేషియా ఆటగాళ్లకు, ముగ్గురు అర్జెంటీనా ఆటగాళ్లుకు రిఫరీలు ఎల్లో కార్డు చూపించారు.

రికార్డులు.. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో 1-1తో ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న అర్జెంటీనా.. సాకర్‌ ప్రపంచకప్‌లో లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవకపోవటం 44 సంవత్సరాల తర్వాత ఇదే కావడం విశేషం. ఫుట్‌బాల్‌ సంగ్రామంలో ఓటమి పరంగా 1958లో ఛెకోస్లోవేకియాపై 1-6 తేడాతో ఓటమి తర్వాత రెండో అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఇక నాకౌట్‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే జూన్‌26న నైజీరియాతో జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top