నాకు ఏ అవమానం జరగలేదు: మను

CWG 2018 Gold Medalist Manu Bhaker Humiliated In Haryana - Sakshi

ఛండీగడ్‌ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించిన పదహారేళ్ల షూటర్‌ మను భాకర్‌కు అవమానం జరిగింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పిన్న వయసులోనే స్వర్ణం సాధించిన ఆమెకు సొంతూరిలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది. ఛార్కీ దాద్రీ పట్టణంలో ఫోగట్‌ కాప్‌ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు పూలమాలలతో మను భాకర్‌ ను సత్కరించిన అనంతరం ఆమె వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. అయితే కొంత మంది వీవీఐపీలు రావడంతో మను భాకర్‌ తన కుర్చీలో నుంచి లేవాల్సి వచ్చింది.

‘పెద్దలు’ కుర్చీల్లో ఆసీనులు కావడంతో ఆమె నేలపైనే కూర్చోవలసి వచ్చింది. కాగా, రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, బబితా కుమారీలను కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ ఘటనపై మను భాకర్‌ తండ్రి స్పందిస్తూ.. అదేం లేదు. పెద్దల్ని గౌరవించడంలో భాగంగానే ఆమె నేలపై కూర్చుంది. అది సంప్రదాయంలో భాగమే. ఆమె తన చర్యతో పెద్దల్ని గౌరవించడం పట్ల యువతకు ఒక సందేశాన్నిచ్చింది. దీన్ని అనవసరంగా రాద్దాంతం చేయొద్దని వ్యాఖ్యానించారు. పాల్గొన్న తొలి కామన్వెల్త్‌ క్రీడల్లోనే సత్తా చాటిన భాకర్‌, సీనియర్లను తలదన్ని ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో 240.9 పాయింట్లు (కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు) సాధించి బంగారు పతకాన్ని గెలుపొందడం విశేషం.

ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మను భాకర్‌ స్పందించారు. మీరేదో ఊహించుకుని వార్తలు రాయడం సరికాదని ఆమె మీడియాను ఉద్దేశించి అన్నారు. ‘నాకు ఏ అవమానం జరగలేదు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దల్ని గౌరవించి నేను కింద కూర్చున్నాను. దానికి ఎందుకు అంత ప్రాధాన్యం.. పెద్దల్ని గౌరవించడం తప్పా..? మన కన్నా పెద్దవారొచ్చినప్పుడు వారిని గౌరవించకుండా హుందాగా అలానే కూర్చుంటారా..? అని ప్రశ్నించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top