చైనా మహిళలు పతకం లేకుండానే..! | Sakshi
Sakshi News home page

చైనా మహిళలు పతకం లేకుండానే..!

Published Fri, Aug 19 2016 6:20 PM

చైనా మహిళలు పతకం లేకుండానే..!

రియో డి జనీరో: తొలిసారిగా 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ గేమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచీ ప్రతి ఒలింపిక్స్ లో చైనా మహిళా క్రీడాకారుణులు సత్తాచాటుతున్నారు. అయితే రియో ఒలిపిక్స్ నుంచి  మహిళల సింగిల్స్ విభాగంలో పతకం లేకుండా చైనా క్రీడాకారిణులు వెనుదిరగడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేక పోతోంది. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఓ చైనా ప్లేయర్ పోడియంపై చోటు దక్కించుకోలేక పోవడం గమనార్హం. చివరగా అట్లాంటా ఒలింపిక్స్-1996లో మాత్రమే చైనా మహిళలు సింగిల్స్ లో పతకం లేకుండా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతి ఒలింపిక్స్ లో విశేషంగా రాణిస్తూ రెండేసి పతకాలను కొల్లగొడుతూ వచ్చారు.

1992లో అట్లాంటా ఒలింపిక్స్- రెండు కాంస్య పతకాలు, 2000- సిడ్నీ ఒలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు, 2004లో ఎథెన్స్ ఒలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు, 2008- బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణం, రజత పతకాలు, 2012- లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణం, రజతాలను చైనా మహిళలు సొంతం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఈ సారి కాంస్య పతకమైనా దక్కుతుందని చైనా అభిమానులు ఆశపడగా సెమీఫైనల్లో స్వల్పంగా గాయపడ్డ డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ షట్లర్ ఝరయ్ కాంస్య పతక పోరు నుంచి వైదొలిగింది. దీంతో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పతకం లేకుండా చైనా ఇంటిదారి పట్టింది. గత నాలుగు ఒలింపిక్స్ లో స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్న చైనా.. రియోలో మాత్రం ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

2012 లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని కొల్లగొట్టిన చైనా ప్లేయర్ లీ ఝరయ్ గాయంతో వైదొలగడంతో చైనా ఖాతా తెరవకుండానే సింగిల్స్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఫైనల్లో ఎవరు గెలిచినా సంచలనమే. స్పెయిన్, భారత్ రెండు దేశాల ప్లేయర్స్ కు ఈ విభాగంలో స్వర్ణాలు రాలేదు. ఇప్పటికే  కాంస్యం దక్కించుకున్న ఒకుహార జపాన్ తరఫున పతకం నెగ్గిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. శుక్రవారం సాయంత్రం స్వర్ణం కోసం స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తలపడనున్న విషయం తెలిసిందే.   

Advertisement
Advertisement