అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు | Chess Olympiad: India Men and Women hold fancied rivals to draw, tense last round for medal awaits | Sakshi
Sakshi News home page

అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు

Sep 13 2016 11:55 PM | Updated on Sep 4 2017 1:21 PM

అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు

అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు

ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి.

ముగిసిన చెస్ ఒలింపియాడ్
* హరికృష్ణ, విదిత్, తానియాలకు చేజారిన కాంస్యాలు
* ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌కు అమ్మాయిల జట్టు అర్హత
బాకు (అజర్‌బైజాన్):
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. అయితే మూడు కాంస్య పతకాలు గెల్చుకునే అవకాశాన్ని భారత క్రీడాకారులు త్రుటిలో చేజార్చుకున్నారు. పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ, ఆధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, మురళీ కార్తికేయన్‌లతో కూడిన భారత జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది.

ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, బొడ్డ ప్రత్యూషలతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో నిలిచినందున భారత మహిళల జట్టు వచ్చే ఏడాది మేలో రష్యాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. 2014లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది.
 
కార్ల్‌సన్‌ను నిలువరించిన హరికృష్ణ
నార్వే జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరిగిన గేమ్‌ను హైదరాబాద్ ప్లేయర్ హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడం విశేషం. హ్యామర్‌తో జరిగిన గేమ్‌ను ఆధిబన్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించగా... విదిత్ 45 ఎత్తుల్లో ఆర్యన్ తారిని ఓడించాడు. అయితే ఫ్రోడ్ ఉర్కెడాల్‌తో జరిగిన గేమ్‌లో సేతురామన్ 25 ఎత్తుల్లో ఓడిపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవరాల్‌గా భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది.
 
‘డ్రా’తో ముగించిన అమ్మాయిలు
అమెరికా జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఇరీనా క్రుష్‌తో జరిగిన గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో... కాటరీనా నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను సౌమ్య 94 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. తానియా 78 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీని ఓడించగా... పద్మిని రౌత్ 40 ఎత్తుల్లో నాజి పైకిడ్‌జి చేతిలో ఓడిపోవడంతో భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, అజర్‌బైజాన్ చేతిలో మాత్రమే ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది.
 
చేరువై... దూరమై...

ఇక వ్యక్తిగత విభాగాల ప్రదర్శను పరిగణనలోకి తీసుకుంటే... పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ బోర్డు-1పై 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, బోర్డు-3పై విదిత్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో... మహిళల విభాగంలో తానియా బోర్డు-3పై 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను త్రుటిలో కోల్పోయారు. టాప్-3లో నిలిచినవారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు.
 
అమెరికా, చైనాలకు స్వర్ణాలు
 పురుషుల విభాగంలో అమెరికా జట్టు 20 పాయింట్లతో స్వర్ణం సాధించగా...ఉక్రెయిన్, రష్యా, రజత కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. మహిళల విభాగంలో చైనా 20 పాయింట్లతో పసిడి పతకాన్ని కై వసం చేసుకోగా... పోలాండ్, ఉక్రెయిన్ రజత, కాంస్య పతకాలను సంపాదించాయి. 2018 చెస్ ఒలింపియాడ్‌కు జార్జియా ఆతిథ్యం ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement