కోహ్లికి... మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఎంతో తేడా! 

Brian Lara Says There is Huge Gap Between Virat Kohli and Rest of World - Sakshi

విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా 

ముంబై: ఏ ఫార్మాట్‌లో చూసినా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లికి మిగతా బ్యాట్స్‌మెన్‌కు మధ్య చాలా అంతరం ఉందని వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా అన్నాడు. గురువారం ఇక్కడి డీవై పాటిల్‌ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న లారా... ఈ తరంలో కోహ్లి అత్యుత్తమం అంటూనే తన ఆల్‌ టైం ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌గా మాత్రం సచిన్‌ టెండూల్కర్‌కే ఓటేశాడు. ‘రోహిత్‌ ఈ ప్రపంచ కప్‌లో నాలుగు శతకాలు చేసి ఉండొచ్చు. బెయిర్‌ స్టోనో ఇంకెవరో రాణిస్తుండవచ్చు. కానీ, కోహ్లి ఓ పరుగుల యంత్రం. టి20, వన్డేలు, టెస్టులు ఇలా ఏది చూసినా అతడికి ఇతరులకు పోలికే లేదు’ అని లారా విశ్లేషించాడు. ఇప్పుడు భారత బ్యాట్స్‌మెన్‌ విదేశాల్లోనూ రాణిస్తున్నారంటే దానికి సచిన్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసమే మూలమని అతడు పేర్కొన్నాడు. ‘సచిన్‌ ప్రభావం నమ్మశక్యం కానిది. అతడు మినహా గతంలో భారత బ్యాట్స్‌మెన్‌ అంతా విదేశాల్లో సాధారణంగా కనిపించేవారు. నేడు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అందరూ బాగా ఆడుతున్నారు. వారికి  సచిన్‌ స్ఫూర్తిగా నిలిచాడు’ అని లారా ప్రశంసించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top