
'అది కోహ్లీకి అతిపెద్ద ఛాలెంజ్'
త్వరలో టీమిండియా చేపట్టనున్న బంగ్లాదేశ్ పర్యటన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతి పెద్ద ఛాలెంజ్ గా అభివర్ణించాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
శ్రీనగర్:త్వరలో టీమిండియా చేపట్టనున్న బంగ్లాదేశ్ పర్యటన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతి పెద్ద ఛాలెంజ్ గా అభివర్ణించాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ప్రస్తుత పరిస్థితులను చూస్తే బంగ్లాదేశ్ చాలా బలంగా కనిపిస్తోందని.. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో వారు అమోఘంగా రాణించి ఆకట్టుకున్నారన్నాడు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్ తప్పకుండా కోహ్లీకి ఒక సవాల్ గా మారనుందని పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా బుధవారం(జూన్ 10) నుంచి టీమిండియా తన తొలి టెస్టును ఆడనుంది. ఈ సంవత్సర ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ ఐదు రోజుల ఫార్మెట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సిరీస్ చివరి టెస్టులో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.