జేమ్స్ ఫాల్క్‌నర్ (148 బంతుల్లో 94; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ కోలుకుంది.
అమిత్ మిశ్రాకు 4 వికెట్లు
బ్రిస్బేన్: జేమ్స్ ఫాల్క్‌నర్ (148 బంతుల్లో 94; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ కోలుకుంది. మ్యాచ్ తొలి రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఫాల్క్‌నర్, పీటర్ ఫారెస్ట్ (189 బంతుల్లో 77; 13 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 4, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు. అయితే మిశ్రా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన ఒక ఓవర్లో ఫాల్క్‌నర్ నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. చివరకు మిశ్రా బౌలింగ్‌లోనే వెనుదిరిగిన ఆసీస్ కెప్టెన్ కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని చేజార్చుకున్నాడు. భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. ప్రజ్ఞాన్ ఓజా, కరుణ్ నాయర్, ధావల్ కులకర్ణిల స్థానంలో అమిత్‌మిశ్రా, బాబా అపరాజిత్, అనురీత్ సింగ్‌లకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించింది.