ఐపీఎల్‌: బాహుబలి ఇన్నింగ్స్‌కు రాజమౌళి ఫిదా! | Ambati rayudu Bahubali innings, Rajamouli Applauds | Sakshi
Sakshi News home page

Apr 22 2018 7:13 PM | Updated on Jul 14 2019 4:05 PM

Ambati rayudu Bahubali innings, Rajamouli Applauds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో తెలుగు బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. సొంత గడ్డపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. మొదట్లో పరుగులు రావడం కష్టంగా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తొలుత ఆచితూచి ఆడుతూ.. మెళ్లిగా పరుగుల వేగాన్ని పెంచాడు. రైనాకు జోడీగా స్కోర్‌ బోర్డును పరుగెత్తించాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన 12 ఓవర్‌లో సురేశ్‌ రైనా వరుస రెండు సిక్సులు బాది బ్యాటింగ్‌ జోరును పెంచాడు. ఈ  క్రమంలోనే అంబటి రాయుడు 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్‌ 144 పరుగుల వద్ద అంబటి రాయుడు పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అంబటి, రైనా (54 నాటౌట్‌;43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అద్భుతంగా ఆడటంతో లోకల్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై నిర్దేశించింది.

చెన్నై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసి కీలకంగా వ్యవహరించిన బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంబటి ఆటను చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తన ట్విటర్‌ పేజీలో బాహుబలి ఇన్నింగ్స్‌ అంటూ ప్రశంసించింది. విజిల్‌ పోడు అంటూ అంబటి ఇన్నింగ్స్‌పై తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంబటి ఇన్నింగ్స్‌కు ‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కూడా ఫిదా అయ్యారంటూ..అభిమానులు ఆయన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, చెన్నై మ్యాచ్‌కు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. అంబటి ఇన్నింగ్స్‌ను ఆస్వాదించిన ఆయన.. అంబటి అర్ధసెంచరీకి లేచినిలబడి చప్పుట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement