
31 మందిపై ఒలింపిక్స్ సంఘం వేటు!
ఆరు క్రీడాంశాలకు చెందిన 31 మంది అథ్లెట్లను రియో ఒలింపిక్స్ నుంచి నిషేధించే అవకాశం ఉంది.
ఆరు క్రీడాంశాలకు చెందిన 31 మంది అథ్లెట్లను రియో ఒలింపిక్స్ నుంచి నిషేధించే అవకాశం ఉంది. బీజింగ్‌లో 2008లో జరిగిన ఒలింపిక్స్ సమయంలో ఇచ్చిన శాంపిళ్లలో వారు డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై వేటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 454 మంది అథ్లెట్ల శాంపిళ్లను పరిశీలించారు. తర్వాత ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా), అంతర్జాతీయ ఫెడరేషన్లతో కలిసి మళ్లీ పరీక్షలు చేయించామని, డోపీలందరిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఐఓసీ తెలిపింది. డోపింగ్‌కు పాల్పడినవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రియో ఒలింపిక్స్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి 31 మంది అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వాళ్లపై వెంటనే చర్యలు ప్రారంభించేందుకు ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది. మరోవైపు లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారిలో 250 మంది నుంచి తీసుకున్న శాంపిళ్ల ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. రియో డి జెనిరోలో జరిగే ఒలింపిక్స్‌లో డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో ఆపాలన్నదే తమ లక్ష్యమని ఐఓసీ తెలిపింది. డోపింగ్‌కు పాల్పడినట్లు తేలిన అథ్లెట్లను పూర్తిగా అనర్హులుగా ప్రకటిస్తామని, ఇతరులను కూడా మళ్లీ పరీక్షిస్తామని అంటున్నారు.