ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే వాట్సాప్‌ చెప్పేస్తుంది!

WhatsApp Can Tell Users When A Message Forwarded Many Times - Sakshi

వాట్సప్‌లో ఒక మెసేజ్‌ ఎక్కువసార్లు ఫార్వార్డ్ చేయబడితే అది యూజర్‌కు తెలిసే విధంగా వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఫ్రీక్వెట్లీ ఫార్వాడెడ్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో చాలాసార్లు ఫార్వాడ్‌ చేసిన మెసేజ్‌ను సులభంగా గుర్తించొచ్చు. ఎక్కువసార్లు ఫార్వాడ్‌ చేయబడిన మెసెజ్‌లు ‘రెండు బాణాలతో కూడిన ప్రత్యేక చిహ్నం’తో కనిపిస్తాయి. తమ మెసేజ్‌ను ఇతరులకు తరచుగా ఫార్వాడ్‌ చేస్తే యూజర్‌కు నోటిఫికేషన్‌ కూడా వస్తుంది. ఐదు కంటే ఎక్కువసార్లు ఫార్వాడ్‌ చేసినప్పుడు మాత్రమే ఈ లేబుల్‌ కనబడుతుంది.

వాట్సాప్ ‘ఫార్వార్డ్’ లేబుల్‌కు అదనంగా 'ట్యాప్‌'ను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్‌లు సుదీర్ఘంగా ఉంటే యూజర్‌ దానిని చదివేందుకు వీలుగా 'ట్యాప్‌' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో యూజర్‌ అనుభూతిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్టు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో నకిలీ వార్తలను గుర్తించడం, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకుండా ఆపడం తేలిక అవుతుంది.

వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి తన చెల్లింపు సేవ అయిన ‘వాట్సాప్ పే’ను భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కాగా, వాట్సాప్ భారతదేశంలో 400 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top