వేతన వెతలు

gram panchayath workers suffering with low wages - Sakshi

పంచాయతీల్లో కార్మికులకు నెలల తరబడి అందని జీతాలు

అమలుకు నోచుకోని కనీస వేతనాల 151 నూతన జీవో

పారిశుద్ధ్య కార్మికులపై జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

కార్మికుల ఇబ్బందులు.. చోద్యం చూస్తున్న పాలకులు

గ్రామ పంచాయతీల కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెలనెల వేతనాలు అందక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారంపై పాలకులు అలివిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న జీవోలు సైతం అమలకు నోచుకోని దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వాలు.. లాఠీ దెబ్బలకు వెరవకుండ పోరాడి సాధించుకున్న జీవోలను అధికారులు కాగితాల్లోనే మగ్గబెడుతున్నారు. వాటిని అమలు చేయకుండా సంకెళ్లు వేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు.

ఒంగోలు టూటౌన్‌: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తే.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పారిశుద్ధ్య కార్మికులు, టైమ్‌స్కేల్‌ కార్మికులు, పర్మినెంట్, టెండర్, ఎన్‌ఎంఆర్‌ ఇలా ఐదు రకాల  కార్మికులు పనిచేస్తున్నారు. పర్మినెంట్, టైమ్‌ స్కేల్‌ కార్మికులు కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌ (దినసరి కూలీలు) పద్ధతిలో పనిచేసే కార్మికులు దాదాపు 1000 మంది ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు 100 వరకు ఉన్నారు. వీరందరికీ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో 30 శాతం నిధులను జీత, భత్యాలకు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ విధానం ఏ గ్రామ పంచాయతీలో అమలుకు నోచుకోవడం లేదు.

అరకొర వేతన
కార్మిక వేతన చట్టం ప్రకారం నెలకు రూ.12 వేల వరకు ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా  కేవలం రూ.ఆరు వేలు, కొన్ని పంచాయతీల్లో రూ.7 వేలలోపు వేతనాలు చెల్లిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఈ అరకొరగా ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పొదిలి, పామూరు, సంతనూతలపాడు, దర్శి ఇలా చాలా గ్రామ పంచాయతీల్లో ఏడాది నుంచి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కొన్ని పంచాయతీల్లో మూడు నెలలు, ఆరు నెలలకు కూడా ఇవ్వడం లేదు. కొత్తపట్నం పంచాయతీలో పది మంది స్వీపర్లు వారికి 6 నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అనధికారికంగా ఒక్కో కార్మికునికి  రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సంతనూతలపాడులో ఇటీవల కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేశారు. పది నెలలకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 5 నెలలకు ఇచ్చి ఊరటనిచ్చారు. ఇలా నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. చిల్లర దుకాణాల్లో కూడా అప్పులు పెరిగి తిరిగి అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. అయినా అధికారులకు కార్మికుల పట్ల కనికరం లేకుండా పోతోంది. 

జీవో అమలులో నిర్లక్ష్యం
కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని 13–07–2011న (మెమో నెం.16306 /ఇ.ఎస్‌.టి.టి /4 /ఎ2 /2010–4), (పి.ఆర్‌.ఓ.సి. నెం. సి /953/2014) ప్రకారం రోజుకు రూ.300 ఇవ్వాలని ఆదేశాలు గతంలో జారీ చేశారు. జారీ చేసిన జీవో కాపీలు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పంచాయతీ, స్థానిక పంచాయతీలకు అందాయి. దశాబ్దాలు గడిచినా నేటికీ జీవో అమలు చేసిన నాథుడు లేడు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఆ జీవో కాగితాల్లోనే మగ్గుతోంది. మళ్లీ తాజాగా ఇటీవల ప్రభుత్వం 151 జీవోని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం కార్మికులకు నెలకు రూ.12 వేలు వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు ఈ జీవో అమలకు నోచుకోలేదు.

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌
హైకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్‌ ఇచ్చింది. గ్రామ పంచాయతీల్లో కార్మికుల నియామకానికి నిర్వహిస్తున్న టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకులు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ల విధానం రద్దు చేస్తామని చెప్పారు. టెండర్ల రద్దు చిత్తూరు జిల్లాలో అమలకు నోచుకుంది. మన జిల్లాలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు.

కలగానే 010 పద్దు జీతాలు
పర్మినెంట్‌ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011 సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షుడిగా, జిల్లా పంచాయతీ అధికారి, డీఎల్‌పీవోతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పర్మినెంట్‌ కార్మికులను గుర్తించి వివరాలు పంపిస్తే ప్రభుత్వం ఖజానా శాఖ ద్వారా జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది. పర్మినెంట్‌ కార్మికులు ఉన్న పంచాయతీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. మిగిలిన పార్ట్‌టైం, ఎన్‌ఎంఆర్‌ పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీలు వేతనాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో పర్మినెంట్‌ కార్మికులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆందోళనకు సిద్ధం
గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఆందోళన చెపడుతున్నట్లు సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు మజూందర్‌ తెలిపారు. టెండర్ల విధానం రద్దు చేయాలని, నెలనెలా కార్మికులకు జీతాలు ఇవ్వాలని, 151 జీవో ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మజుందార్‌ పేర్కొన్నారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top