జిల్లా పరిషత్‌ చివరి సమావేశం

ZPTC Last Meeting In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. నేడు నిర్వహించ తలపెట్టిన సమావేశం జరిగేలా లేదు. కోరం లేక వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం జూలై మొదటి వారం వరకు ఉంది. అంటే మరో రెండు నెలల లోపు ఈ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించాలని జెడ్పీ చైర్మన్‌ దఫెదార్‌ రాజు నిర్ణయించారు. కాగా సమావేశానికి సభ్యులు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు చేయరాదు. అలాగే పాలకవర్గం కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు వీలు లేదు. దీంతో సమావేశానికి సభ్యుల çహాజరు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం జెడ్పీటీసీలుగా ఉన్న వారు, ఎంపీపీలుగా కొనసాగుతున్న వారు ఎన్నికల్లో పోటీ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవు. దీంతో సమావేశం వచ్చే నెలకు వాయిదా పడే అవకాశాలున్నట్లు సభ్యులు 
అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నికల పనుల్లో అధికారులు బిజీ.. 
మరోవైపు వరుస ఎన్నికల పనుల్లో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం బిజీగా ఉంది. ‘పరిషత్‌’ ఎన్నికల పోలింగ్‌ ఇటీవలే ముగిసింది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ సమయం కూడా దగ్గర పడుతోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సమావేశం నిర్వహించి, సమస్యలపై చర్చించే క్రమంలో సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులు లేకపోతే ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశం వచ్చే నెలలో నిర్వహించన్నట్లు తెలుస్తోంది.

సాధారణ నిధులపై తీర్మానాలు
జిల్లా పరిషత్‌ నిధులతో వివిధ అభి వృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేయాలని పాలకవర్గం భావిస్తోంది. జెడ్పీలో ప్రస్తుతం సాధారణ నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులతో తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పన, చిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం భావిస్తోంది. ఈ పనులు మంజూరు కావాలంటే జెడ్పీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండటంతో వచ్చే నెలలోనే తీర్మానాలు చేయాల్సి వస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top