
జోరంథంగా
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు.
తాన్లూ్యయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్‌జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్‌లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు.