
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంపై పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోపాటు ఏపీకి సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని, వీటిని నెరవేర్చాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు తమ అధినేత వైఎస్ జగన్ పార్లమెంటు సమావేశాల్లో తమకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని అన్నారు.
ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం 31 రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆదివారం రాత్రి కూడేరులోనే వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు వైఎస్ జగన్‌తో చర్చించారు. ఈ నెల 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.