
న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: సుజనా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయనలా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర తమది కాదని వైఎస్సార్ సీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కారుకూతలు కూస్తే సహించేది లేదని, దమ్ముంటే ఒక్క ఎంపీ పేరు చెప్పాలని వారు సవాల్ విసిరారు. శుక్రవారం ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్.రెడ్డప్ప, నందిగం సురేష్, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, సత్యవతి, గొడ్డేటి మాధవిలు మీడియాతో మాట్లాడుతూ సుజనా వ్యాఖ్యల్ని తూర్పారబట్టారు.
బీజేపీలో చేరి చంద్రబాబు కోవర్టులా పనిచేస్తున్నారని.. అసలు సుజనా ఒరిజినల్ బీజేపీనా? డూప్లికేటా? అని ప్రశ్నించారు. చచ్చిన టీడీపీని బతికించేందుకు సుజనా చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, అతని గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగనే చెబుతారని ఎద్దేవా చేశారు. సుజనా, సీఎం రమేష్‌లను నమ్ముకొని ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటే కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదినట్లేనని.. బ్యాంకులకు రూ. 6 వేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి వాటిని చెల్లించాక మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక హద్దుదాటి ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్ జగన్ తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వారు హెచ్చరించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలో చేరిన సుజనా గురించి ఎవర్ని అడిగినా బ్యాంకు దొంగే అని చెబుతారని వ్యాఖ్యానించారు.
మరో 15 ఏళ్లు జగనే సీఎం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో తమకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్టిచ్చారని, కొన ఊపిరి ఉన్నంతవరకూ జగన్ వెంటే తాము నడుస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విరాళాలు ఇచ్చి ఎంపీ పదవిని కొనుక్కున్న సుజనా చౌదరికి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదు. మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
సుజనా.. బ్యాంకుల లూటీ ఎలాగో ప్రెస్‌మీట్ పెట్టండి!
ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, అమరావతి: సుజనాచౌదరి ప్రెస్‌మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వేరు.. అందులో ఉన్న ‘బాబు జనాల పార్టీ’(బీజేపీ) వేరని అందరికీ మరోసారి అర్థమైందంటూ ట్విట్టర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు వరుస కథనాలతో మోతెక్కించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు సుజనా చౌదరిని జస్టిస్ చౌదరిగా చూపించేందుకు ప్రెస్‌మీట్‌ను లైవ్‌లో మోతెక్కించింది. దానికి కారణం.. పబ్లిక్ ఇంట్రెస్టా? లేక పబ్లిక్‌గా తెలిసిపోయిన ఇంట్రెస్టా?. అవినీతి మీద చంద్రబాబు.. ఆకలి మీద లోకేష్ నాయుడు.. అక్రమాలపై అచ్చెన్నాయుడు.. మహిళా రక్షణ మీద చింతమనేని.. సంస్కారం మీద ఉమా.. స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో.. ఏపీ ప్రయోజనాలపై మీరు ప్రెస్‌మీట్లు పెడితే అలాగే ఉంటుంది. బ్యాంకుల లూటీపై మీరు ముంచేసిన బ్యాంకుల అధికారులతో ప్రెస్‌మీట్ పెట్టండి’ అని ట్వీట్ చేశారు.