మీరు ప్రతిపక్ష నేతా? ప్రజా వ్యతిరేక నాయకుడా? 

YSRCP MLAs Fires On Chandrababu - Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం

సాక్షి, అమరావతి: మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పలేని చంద్రబాబు అసలు ప్రతిపక్ష నాయకుడా? లేక ప్రజా వ్యతిరేక నాయకుడా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలకు చంద్రబాబు దురుద్దేశాలను ఆపాదిస్తుండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు మద్దతునిచ్చింది అక్రమార్కులకే తప్ప ప్రజా సంక్షేమ విధానాలకు కానే కాదని మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు(పలాస), శెట్టి ఫల్గుణ(అరకు), శ్రీదేవి (తాడికొండ), హఫీజ్‌ ఖాన్‌(కర్నూలు) బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. 

ఎమ్మెల్యేలు సంధించిన పలు ప్రశ్నలివి..
- సచివాలయాల్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషించకపోగా టీడీపీ బాధపడుతోందా? జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు, దోపిడీలను కప్పిపుచ్చుకునేందుకే గ్రామ వలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తున్నారా?  
బాపూజీ 150వ జయంత్యుత్సవాల వేళ ప్రారంభమైన గ్రామ సచివాలయాలపై మీ వైఖరేంటి? 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, ప్రతి 2000 జనాభాకు 10 మందిని కేటాయించినందుకు బాధపడుతున్నారా? మీరు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పదివేల మందికి, వెయ్యి మందికైనా ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఉందా? 
జన్మభూమి కమిటీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? సచివాలయాల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది, ఈ రెండూ అసలు పోల్చతగినవేనా? సచివాలయాల కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి.. మీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టుని మహానేతగా చూపించడం మీకు సిగ్గుచేటు కాదా?  
జగన్‌ పరిపాలన మీద ఫోకస్‌ చేస్తుంటే.. మీరు భయపడటం నిజం కాదా? ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో ఒక్కదానినైనా మీరు మెచ్చుకున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనులు ఇస్తుంటే ఆ బిల్లులకైనా మీరు మద్దతిచ్చారా? నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో 50 శాతం మహిళలకిస్తూ చట్టం అసెంబ్లీలో పాస్‌ అవుతుంటే దానికైనా మద్దతిచ్చారా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top