ప్రజల వద్దకు ప్రతిపక్షం

ysrcp leaders conduct rachabanda and pallenidra in east godavari - Sakshi

తొమ్మిది నియోజకవర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు

సమస్యలు ఏకరువు పెడుతున్న జనం

నమోదు చేసుకుంటున్న వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్లు

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ వారి ముంగిటకే వెళ్తోంది. రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు గ్రామాలు, కాలనీల్లో బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలు ఏకరువు పెట్టారు. వారికి భరోసా ఇచ్చిన నేతలు.. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుందో వివరించారు. దళితుల గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, నవరత్న పథకాల ద్వారా జరిగే మేలును రచ్చబండలో వివరించారు. రాత్రి ఆయా కాలనీల్లోని దేవాలయాలు, స్కూళ్లలో బస చేశారు.

కోటనందూరులో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో పి.గన్నవరం కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రౌతులపూడి మండలం పి.చామవరంలో ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, గండేపల్లి మండలం ఉప్పలపాడులో జగ్గంపేట కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్, అనాతవరంలో ముమ్మిడివరం కో ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ, రంగంపేట ఎస్టీ కాలనీలో అనపర్తి కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొత్తపల్లి మండలం రమణక్కపేటలో పిఠాపురం కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, కపిలేశ్వరపురం మండలం నేలటూరులో మండపేట కో ఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. కడియం మండలం మురమండలో శనివారం రచ్చబండ నిర్వహించగా, ఆదివారం ప్రత్యేక హోదాకు మద్దతుగా రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. అదే నియోజకవర్గం ధవళేశ్వరంలో మరో కో ఆర్డినేటర్‌ గిరిజాల వీర్రాజు (బాబు) కూడా సంతకాలు సేకరించారు.

ప్రజా సమస్యలే ఎన్నికల మేనిఫెస్టో : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
కోటనందూరు: తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని, వాటి పరిష్కారాలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. కోటనందూరు కొత్త ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ‘రచ్చబండ–పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీలో ఉండాల్సిన తమ పార్టీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు పల్లెల్లో తిరుగుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో సంతలో పశువుల మాదిరిగా కొలుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలంటే గౌరవం లేని అసెంబ్లీని అందుకే బాయ్‌కట్‌ చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తొలుత ఈ కార్యక్రమాన్ని దళితవాడల్లో నిర్వహిస్తున్నామన్నారు.

నేరుగా ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, పార్టీ అధికారం చేపట్టిన తరువాత వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దళిత మహిళలు వివిధ సమస్యలను వివరించారు. అర్హులకు కూడా పింఛన్లు ఇవ్వడం లేదని, ఒక్క ఇల్లు కూడా నిర్మించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో రాజన్న పాలన వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. దళితులకు ఉచిత కరెంటు, వృద్ధులకు రూ.2 వేల పింఛను, మండల కేంద్రాల్లో వృద్ధాశ్రమాలు వంటి అనేక హామీలను జగన్‌ ప్రకటించారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంను చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ గొర్లి రామచంద్రరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, జిల్లా కార్యదర్శి పెదపాటి అమ్మాజీ, సర్పంచ్‌లు బొంగు గోపాలకృష్ణ, యలమంచిలి దేవుళ్ళు, ఎంపీటీసీ సభ్యురాలు గర్సింగు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top