కడప జిల్లాపై వివక్ష చూపుతున్నారు

YSRCP Leader Mithun Reddy Slams TDP Mps At Maha Dharna - Sakshi

టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలి

పదవి లేకుండా టీడీపీ ఎంపీలు ఒక్క రోజు కూడా ఉండలేరు

మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి

సాక్షి, రాజంపేట : వైఎస్సార్‌ జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారని మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్‌సీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌ హయాంలో ఉన్న అనుకూలత ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ నేతలకు ఉక్కు పరిశ్రమ గుర్తొచ్చిందా అని నిలదీశారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టే టీడీపీ నేతలు దీక్షలు చేసేవారా అంటూ ఎద్దేవా చేశారు.

ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ, సీఎం రమేష్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలని.. దానికి తాము కూడా మద్ధతు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ చిత్తశుధ్దితో పోరాటం చేస్తోందని అన్నారు. తాను, కడప మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి పార్లమెంట్‌లో ఎన్నోసార్లు ఉక్కు పరిశ్రమ కోసం గట్టిగా నిలదీశామని చెప్పారు. ఆరోజు నోరు కూడా తెరవని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమతో పాటు టీడీపీ ఎంపీలు కలిసి రావాలని కోరితే ఎదురు దాడికి దిగుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్క రోజుకూడా పదవిని వదులుకోవడానికి టీడీపీ ఎంపీలు సిద్ధంగా లేరని విమర్శించారు. వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రవీంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌ రెడ్డి, రాజంపేల పార్లమెంట్‌ అద్యక్షుడు అమర్నాథ్‌ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలకు రాజంపేట న్యాయవాదుల అసోసియేషన్‌ సంఘీభావం తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top