హోదా పోరు చంద్రబాబుదా? : వైఎస్‌ జగన్‌ | YS jagan Slams Chandrababu Over Special Status Issue | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య పోరాటం బ్రిటిషర్లదా? హోదా పోరు బాబుదా?

Mar 10 2018 6:33 PM | Updated on Mar 23 2019 9:10 PM

YS jagan Slams Chandrababu Over Special Status Issue - Sakshi

చీరాల క్లాక్‌టవర్‌ సెంటర్‌లో అశేషజనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌.

సాక్షి, చీరాల : భారతీయుల ఉక్కుపిడికిలికి జడిసిన బ్రిటిష్‌ వాడు.. పోతుపోతూ ‘ఇది నేనిచ్చిన స్వాతంత్ర్యం’ అంటే ఎలా ఉండేదో సరిగ్గా చంద్రబాబు నాయుడి తీరు అలా ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. హోదా విషయంలో నాలుగేళ్లపాటు రోజుకో నాటకమాడిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పలేదని, అయినా సరే, తానే హోదా పోరాటం చేశానని చెప్పుకోవడం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా హోదా మాటెత్తిన టీడీపీ.. ‘కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం’లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 108వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల పట్టణం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

బాబుకు ఆస్కార్‌ అవార్డు దక్కేది : ‘‘నాలుగేళ్లుగా అన్యాయమైన పాలనే చేస్తున్నాడు. కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించారా అంటే అదీలేదు. ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం దగ్గర తాకట్టుపెట్టాడు. హోదా ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు వస్తాయి.. తద్వారా పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ హోదాపై బాబువి ఎన్ని డ్రామాలో మీరంతా చూస్తున్నారు. మొన్న అరుణ్‌ జైట్లీ.. పాతపాటే పాడితే.. చంద్రబాబు కొత్త నాట్యం చేశారు. 2015లోనే జైట్లీ తెగేసి చెప్పినప్పుడే.. బాబు తన మంత్రులతో రాజీనామాలు చేయించి ఉంటే.. ఈ పాటికి హోదా వచ్చేఉండేది. నాలుగేళ్లపాటు మంత్రి పదవులు అనుభవించి.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్లేటు ఫిరాయించారు. సరే ఇప్పటికైనా సరిగా పోరాడతారా అంటే అదీ లేదు! మంత్రి పదవులకు రాజీనామా చేస్తారట.. ఎన్డీలో మాత్రం కొనసాగుతూనేఉంటారట!, ఇక అసెంబ్లీలోనైతే బీజేపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకుంటారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడదాం రమ్మంటే మాత్రం స్పందించడు. రాష్ట్రానికి రాష్ట్రమే రాజీనామాలు చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుంది. కానీ ఆ పెద్దమనిషికి చిత్తశుద్ధిలేదు. ఇటీవల ఉత్తమ నటులకు ఇటీవలే ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. పాపం వాళ్లకు మన చంద్రబాబు కనిపించలేదు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఆడుతున్న నాటకాలకు ఖచ్చితంగా ఆస్కార్‌ అవార్డు దక్కేది’’ అని జగన్‌ చమత్కరించారు.

వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
బాబు పాపాల పాలన :
పక్కనే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పెట్రోల్‌ ధరలకంటే ఏపీలో రూ.7 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనాన్ని చంద్రబాబు దోచుకుంటున్నాడు.
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దుచేస్తానన్నాడు.. ఇప్పుడేమో ఊరూరా మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఫోన్‌ కొడితే మందు బాటిల్‌ తీసుకొచ్చే స్థాయిలో బాబు హైటెక్‌ పాలన సాగుతోంది.
నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లు మహా అయితే రూ.100 వచ్చేది. ఇప్పుడు సామాన్యుడికి కూడా షాకులిస్తున్నారు. కరెంటు బిల్లులు తగ్గిస్తానన్న ఆ పెద్దమనిషే మూడుసార్లు ధరలు పెంచారు.
బాబుగారి హయాంలో మూడుసార్లు ఆర్టీసీ టికెట్‌ ధరలు పెరిగాయి. పండుగలప్పుడైతే మరీ దారుణమైన దోపిడీ. కొత్త సినిమాల మాదిరి ఆర్టీసీ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటోందీ ప్రభుత్వం.
ఒకప్పుడు రేషన్‌ దుకాణంలో బియ్యంతోపాటు నిత్యావసరాలన్నీ రూ.185కే ప్రజలకు అందేవి. ప్రస్తుతం బాబుగారు బియ్యం తప్ప ఏమీ ఇయ్యట్లేదు. వేలిముద్రల సాకుతో చాలా మందికి అదికూడా ఇవ్వట్లేదు.
వ్యవసాయ రుణాలు, డ్వాక్రా చెల్లెమ్మలు, చేనేత సోదరుల రుణాలు రద్దు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. కానీ ఇవాళ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి.
గత ప్రభుత్వాలు బ్యాంకులకే వడ్డీలు ఇచ్చేవి.. ఇప్పుడా విధానాన్ని ఎత్తేయడంతో రుణదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ప్రతి ఇంటికీ తన సంతకంతో లేఖలు పంపారు.. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి 47 నెలలు పూర్తైంది. ఆ లెక్కన ప్రతి ఇంటికీ 94 వేలదాకా పడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు ఇటొస్తే.. మా డబ్బులేవని నిలదీయండి.
అబద్ధాలు, మోసాలపైనే సాగిన చంద్రబాబు పాలనలో.. అవినీతి మాత్రం చాలా బాగా జరిగింది. మట్టి నుంచి ఇసుక దాకా, బొగ్గు నుంచి కరెంటు కొనుగోళ్లదాకా, రాజధాని మొదలు గుడి భూములదాకా అన్నీ కొల్లగొట్టారు.
సంపాదించిన డబ్బులు అరగక.. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేశాడు. వాళ్లను తన పార్టీ గుర్తుపైన పోటీ చేయించే దమ్ము,ధైర్యం కూడా లేదీ పెద్దమనిషికి!
దేశచరిత్రలోగానీ, రాష్ట్ర చరిత్రలోగానీ.. నల్లధనాన్ని ఇస్తూ అడ్డంగా దొరకిపోయిన ముఖ్యమంత్రిని ఇంతకుముందు చూశారా? ఆ ఘనత చంద్రబాబుదే.
గవర్నమెంట్‌ ఉద్యోగి దగ్గర నల్లధనం దొరికితే ఉద్యోగంలోనుంచి తొలగిస్తారు. అలాంటిది ఈ పెద్ద మనిషి సీఎంగా ఉండటానికి అర్హుడా? అని ప్రశ్నిస్తున్నా.
పైన ముఖ్యమంత్రి.. గ్రామస్తాయిలో జన్మభూమి కమిటీలు పందికొక్కుల్లా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి.

మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. :
రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటుకానున్న ప్రజా ప్రభుత్వం ఏమేమి చెయ్యబోతున్నదో ‘నవరత్నాల’ ద్వారా ఇప్పటికే ప్రకటించాం. అందులో పేద పిల్లల చదువులు, పెన్షన్ల అంశాలను మరొకసారి గుర్తుచేసుకుందాం.
పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం
అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం.
అవ్వా, తాతలకు పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచుతాం.
వృత్తి పనివారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పెన్షన్‌ అందించే ఏర్పాటుచేస్తాం.

ఎన్నికలవేళ ఆలోచించండి..
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే.. మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే చంద్రబాబులాంటి వాడిని పొరపాటున కూడా క్షమించొద్దు. ఒక నాయకుడు మైక్‌ పట్టుకుని ఒక మాట చెబితే, దాన్ని నిలబెట్టుకోలేని రోజున రాజీనామాలు చేసే వెళ్లిపోయే పరిస్థితి రావాలి. ఆ మార్పు నా ఒక్కడివల్లేకాదు.. మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement