నవీన్‌ పట్నాయక్‌కు చెక్‌ పెట్టేదెవరు?

Who Will Be The Checkmet For Naveen Patnaik In Odisha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడగలిగింది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతా దళ్‌. ఒడిశాలోని 21 లోక్‌సభ సీట్లకుగాను ఏకంగా 20 సీట్లలో ఆ పార్టీ విజయం సాధించడం విశేషం. అదే సమయంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 147 స్థానాలకుగాను 117 స్థానాల్లో విజయం సాధించడం కూడా విశేషం. అంతకుముందు ఎన్నికల్లో అంటే, 2009లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లలో విజయం సాధించడం మరీ విశేషం. 2009 ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ 14 లోక్‌సభ, 103 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. అంటే బిజూ జనతాదళ్‌ పార్టీని గెలిపించడం కంటే బీజేపీని మట్టికరిపించడమే ప్రధాన లక్ష్యంగా నాటి ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌కు చెక్‌ పెట్టేవాళ్లే లేరా? ఇన్నేళ్లయినా ఆయన ప్రభుత్వంపైన ప్రజల్లో అసంతృప్తిగానీ, వ్యతిరేకతగానీ పెరగలేదా? 2014 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ చాలెంజ్‌ చేసినట్లు ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసింది. అదే సవాల్‌ మేరకు ఒడిశాలో పాగా వేయగలదా ? 40 లక్షల మంది పార్టీ కార్యకర్తలను చేర్చుకోవడం ద్వారా రానున్న ఎన్నికల్లో ‘మిషన్‌ 120’ (120 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడం) ద్వారా పట్నాయక్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ 2015లో అమిత్‌ షా తొడగొట్టడం ఏ మేరకు నిజమవుతుంది? 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హవా సష్టించిన బీజేపీ 2019 ఎన్నికల్లోనూ హవా కొనసాగిస్తుందా? పార్టీకి కంచుకోటయిన గంజాం ప్రాంతంలోని ‘హింజిలీ’ అసెంబ్లీ నియోజక వర్గానికి ఆది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ మొదటిసారి బిజపూర్‌ నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం వెనకనున్న మర్మం ఏమిటీ?

నవీన్‌ పట్నాయక్‌ బిజపూర్‌ నుంచి పోటీ చేయడం అంటే ‘హింజలీ’ నుంచి ఓడిపోతాననే భయమే కారణమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. విస్తారమైన రోడ్లు, మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంతోపాటు సాంకేతికంగా, ఆర్థికంగా నియోజకవర్గం అభివద్ధికి బాటలు వేసిన పట్నాయక్‌ ఆ నియోజక వర్గం నుంచి ఓడిపోవడమంటే అది కలే. ఆ భయమే అయనకుంటే బీజేపీ కాస్త బలంగా ఉన్న బిజపూర్‌ను ఆయన ఎందుకు ఎన్నుకుంటారు ? బీజేపీకే చెక్‌ పెట్టేందుకే! అవును.. అందుకనేనంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2000, 2004లో వరుసగా రెండు సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్‌ పట్నాయక్‌ 2009 ఎన్నికల్లో బీజేపీకి తిలోదకాలిచ్చి ఒంటరిగా పోటీ చేసి పార్టీని గెలుపించుకున్నారు.

2017లో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 846 సీట్లలో 473 సీట్లలో బిజూ జనతాదళ్‌ విజయం సాధించగా, బీజేపీ 296 సీట్లలో విజయం సాధించింది. 2012 ఎన్నికల్లో కేవలం 36 సీట్లకు పరిమితమైన బీజేపీ కాంగ్రెస్‌ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేసి 296 సీట్లను గెలుచుకోవడం విశేషం. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో అవకాశం ఉందన్న విశ్వాసం బీజేపీకి కలిగింది. అయితే 2018లో బిజపూర్‌ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై 40 వేల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2019 ఎన్నికల ప్రక్రియకు ఈ ఫలితాన్ని సూచికగా తీసుకోవచ్చు!

ఇన్నేళ్లు అవుతున్నా ఏ నియోజకవర్గం ప్రజల్లో కూడా నవీన్‌ పట్నాయక్‌ పట్ల వ్యతిరేకత ఇప్పటికీ కనిపించక పోవడం విశేషం. అయితే పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంది. అందుకని కొన్ని నియోజక వర్గాల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఇప్పటికీ సందిగ్ధత నెలకొని ఉంది. నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగనున్న ఒడిశాలో గురువారం తొలి విడత పోలింగ్‌ జరిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top